రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఆయన అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే ప్రజలు మద్దతు పలికారన్నారు. విధ్వంసాలు, కుట్రలతో కూడిన తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించరని ఈ తీర్పుతో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.

కూటమి విజయానికి కృషి చేసిన మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు, ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు పల్లా అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల ఫలితాలు తమపై మరింత బాధ్యతను పెంచాయని, మరింత వినయంతో, అంకితభావంతో పనిచేయాలనే సంకల్పాన్ని ఇచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు.