అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడిపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, గుండె బరువెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. "చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు. ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది," అని ఆయన అన్నారు. ఆడపిల్లలు, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని, ఉన్మాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని లోకేశ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే వాతావరణం సృష్టిస్తామని ఆయన స్పష్టం చేశారు. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించేవారు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే..

రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నేరుగా పదో తరగతి గదిలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న విద్యార్థినిపై చెట్ల కొమ్మలు నరికే రంపంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినిపై కూడా దుండగుడు దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనతో పాఠశాలలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఉపాధ్యాయులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల అదుపులో నిందితుడు

ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ధర్మవరం వైపు పారిపోతుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ధర్మవరం మండలానికి చెందిన యువకుడిగా గుర్తించారు. బాధితురాలికి అతను దగ్గరి బంధువేనని స్థానికులు చెబుతున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత అమానుషమైన చర్య అని పేర్కొన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ ఘటనపై స్పందించి, బాలికకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.