ఆంధ్రప్రదేశ్‌లోని రాప్తాడులో దారుణ దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి బెంగళూరులో నిర్వహించిన కీలక శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ప్రస్తుతం బాలికను పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)కు తరలించి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్యంపై లోకేశ్ ఆదివారం కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆమెకు నిర్వహించిన ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీలు రెండూ విజయవంతం అయ్యాయని వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. బాలిక ప్రాణాలు కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య బృందానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బాలిక కోలుకునే వరకు ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తుందని, అత్యుత్తమ వైద్య సంరక్షణతో పాటు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తుందని లోకేశ్ భరోసా ఇచ్చారు.

ఈ రోజు మధ్యాహ్నం తాను వ్యక్తిగతంగా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడి తదుపరి చికిత్సకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటానని ఆయన తన పోస్టులో వివరించారు. ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, బాలికకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.