రాష్ట్రంలో నేడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి పార్టీల ముఖ్య నేతలు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ తీరుతెన్నులను సమీక్షిస్తూ, పోలింగ్ శాతం పెంచేందుకు పలు కీలక సూచనలు చేశారు.

టెలీకాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. "గతంలో జరిగిన ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇంతటి స్ఫూర్తి కన్పించలేదు. కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజలు ఓట్లు వేసేందుకు బారులు తీరడం శుభపరిణామం" అని ఆయన అన్నారు.

అదే సమయంలో, కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని నేతలకు సూచించారు. "కొంత మంది వృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేకపోవచ్చు. అలాంటి వారిని గుర్తించి, సమన్వయంతో కేంద్రాలకు తీసుకురావాలి. ఎన్నికల నిబంధనలను పాటిస్తూనే పోలింగ్ శాతం పెరిగేలా చూడాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కూటమి శ్రేణులకు చంద్రబాబు పలు జాగ్రత్తలు సూచించారు. "ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా కుట్ర కోణంలో వ్యవహరిస్తారు. మన శ్రేణులు సంయమనం పాటించాలి. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలి" అని ఆయన దిశానిర్దేశం చేశారు.