ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇటీవల హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌తో కొత్త లుక్‌లో కనిపించడం తెలిసిందే. అయితే, ఆ సర్జరీ కోసం ఆయన డబ్బులు చెల్లించలేదని, పైగా ఆయనే డబ్బులు తీసుకున్నారని ఆయన పిల్లలు, నటులు జాన్వీ కపూర్, అర్జున్ కపూర్ వెల్లడించారు. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించే ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఈ ఆసక్తికర విషయాన్ని వారు పంచుకున్నారు.

షోలోని రాపిడ్-ఫైర్ రౌండ్‌లో, మీ నాన్న గురించి ఓ సరదా రూమర్ చెప్పమని కరణ్.. జాన్వీని అడిగారు. దీనికి జాన్వీ స్పందిస్తూ, "ఆయన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోలేదు, ఏకాగ్రతతో జుట్టు పెంచుకున్నారు" అని చమత్కరించారు. ఇది విని నవ్విన అర్జున్, "అయన్ను బయట చూసిన వాళ్ళు ఇది నమ్మరులే" అన్నారు. ఆ తర్వాత బోనీ కపూర్ మేకోవర్ ప్రస్తావన రాగా, జాన్వీ అసలు విషయాన్ని బయటపెట్టారు. "హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవడానికి ఆయనకు డబ్బులు ముట్టాయి" అని జాన్వీ చెప్పగా, అర్జున్ కూడా దాన్ని ధృవీకరించారు.

"ఆయన డబ్బులు చెల్లించలేదు, ఆయనే డబ్బులు తీసుకున్నారు" అని జాన్వీ స్పష్టం చేశారు. ఈ సర్జరీ ఫలితం అద్భుతంగా ఉందని షోలో ఉన్న వరుణ్ ధావన్ ప్రశంసించారు. అందుకేనా ఆయన ముఖంతో ఉన్న బ్యానర్లు నగరం మొత్తం కనిపిస్తున్నాయని కరణ్ అడగగా, జాన్వీ, అర్జున్ అవునన్నారు. "జుట్టు లేనప్పుడు విచారంగా, జుట్టు వచ్చాక సంతోషంగా ఉన్న ఫోటోలతో మరిన్ని బ్యానర్లు రాబోతున్నాయి" అని జాన్వీ సరదాగా చెప్పి నవ్వించారు.


బోనీ కపూర్ 2024లో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ క్లినిక్‌లో సుమారు 6,000 గ్రాఫ్టులతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. తన దివంగత భార్య శ్రీదేవి సలహా మేరకే, ముందుగా 14 కిలోల బరువు తగ్గి ఈ సర్జరీకి వెళ్లినట్లు ఆయన గతంలో తెలిపారు. మొదట శ్రీదేవి ఈ సర్జరీకి అంగీకరించలేదని, బరువు తగ్గిన తర్వాతే చేయించుకోమని చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు దీంట్లో ఒక ప్రమోషనల్ కోణం వెలుగు చూడడంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.