సీనియర్ నటుడు అన్నూ కపూర్ గతంలో తన శరీరాకృతిపై చేసిన 'దూధియా బదన్' (పాల వంటి శరీరం) వ్యాఖ్యలపై నటి తమన్నా భాటియా తొలిసారి స్పందించారు. ఇలాంటి ప్రతికూల విషయాలను తాను పట్టించుకోనని, వాటిని వడపోసి తన పనిపైనే దృష్టి సారిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన ఏడాది తర్వాత ఆమె ఈ వివాదంపై మౌనం వీడారు.

తాజాగా ఎన్డీటీవీ ప్రాఫిట్ ఇగ్నైట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న తమన్నాను ఈ విషయంపై ప్రశ్నించగా, ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "ఒక సృజనాత్మక వ్యక్తిగా మనం వినడం చాలా ముఖ్యం. విన్నవాటిలో దేన్ని ఉంచుకోవాలి, దేన్ని వదిలేయాలి అనేది అర్థం చేసుకోవాలి. ఒక మహిళగా మీరు కూడా అర్థం చేసుకోగలరు.. మనం ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ పోతే జీవితంలో ముందుకు సాగలేకపోవచ్చు" అని తమన్నా హుందాగా సమాధానమిచ్చారు.

తాను అలాంటి వ్యాఖ్యలను అసలు పట్టించుకోనని, తన నటన, కెరీర్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. "నేను నా పనిపైనే దృష్టి పెడతాను. నేను ఏం చేయాలనుకుంటున్నానో దానిపైనే ఫోకస్ చేస్తాను" అని అన్నారు. నటనను కేవలం కెరీర్‌గా కాకుండా ఒక సేవగా భావిస్తానని, అందుకే తన పని ప్రేక్షకులకు బాగా చేరువవుతుందని ఆమె వివరించారు.

ఏమిటీ వివాదం?
2025లో 'స్త్రీ 2' చిత్రంలోని 'ఆజ్ కీ రాత్' పాటలో తమన్నా నటనను చూసిన అన్నూ కపూర్, ఆమె 'పాల వంటి ముఖం, శరీరం' పిల్లలు హాయిగా నిద్రపోవడానికి సాయపడతాయని, ఇది దేశానికి ఒక వరం లాంటిదని వ్యాఖ్యానించారు. ఆమె నటనను కాకుండా శరీరంపై వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఏడాది జూలైలో అన్నూ కపూర్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఒకవేళ తన మాటల వల్ల తమన్నా బాధపడి ఉంటే క్షమాపణ చెబుతానని కూడా ఆయన పేర్కొన్నారు.