నటి రెజీనా కసాండ్రా తన సినీ కెరీర్‌లో తొలిసారిగా ఒక పూర్తిస్థాయి కమర్షియల్ విలన్‌గా నటిస్తున్నట్లు తెలిపారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన 'మూకుత్తి అమ్మన్ 2' చిత్రంలో తాను పోషించిన 'భైరవి' అనే పవర్‌ఫుల్ నెగెటివ్ పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించానని ఆమె అన్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న రెజీనా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుందర్ సి పై రెజీనా ప్రశంసలు కురిపించారు. "గత 30 ఏళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలో ఉంటూ, ఇతర పరిశ్రమలకు వెళ్లకుండానే తమిళ సినిమాను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి సుందర్ సి. అలాంటి దర్శకుడి సినిమాలో ఇంత బలమైన విలన్ పాత్ర లభించడం సంతోషంగా ఉంది. ఇందులో నయనతారతో నా ఫైట్ సీన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి" అని ధీమా వ్యక్తం చేశారు.

2020లో ఘన విజయం సాధించిన 'మూకుత్తి అమ్మన్' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతోంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ కామెడీ చిత్రాన్ని ఇషారి కె. గణేశ్ నిర్మించారు. ఇందులో నయనతార, ఖుష్బూ, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

సినిమా పూజ నుంచి ప్రీ-రిలీజ్ ఈవెంట్ వరకు ప్రతీది ఎంతో గ్రాండ్‌గా నిర్వహించిన నిర్మాత ఇషారి కె. గణేశ్ కు రెజీనా ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి భారీ బడ్జెట్ మహిళా ప్రాధాన్య చిత్రాలు నిర్మించడం తనలాంటి ఎందరో నటీమణులకు కొత్త ఆశను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని, కథను నమ్మి ముందుకొచ్చే నిర్మాతలకు అందరూ మద్దతుగా నిలవాలని ఆమె కోరారు.