నటుడు ధనుష్ కథానాయకుడిగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓం’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న సాయి పల్లవి, తన పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఆసక్తికరంగా స్పందించింది. చిత్రంలో తాను పోషిస్తున్న ‘నిత్య రెడ్డి’ పాత్రలో తన ఆల్టర్ ఇగోను (తనలోని మరో రూపాన్ని) చూసుకుంటున్నానని ఆమె పేర్కొంది.

‘ఓం’ సినిమాలో సాయి పల్లవి, నిత్య రెడ్డి అనే ఐపీఎస్ అధికారిణి పాత్రలో కనిపించనుంది. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఆమె, ఆ తర్వాత సీబీఐలో అడిషనల్ సూపరింటెండెంట్‌గా చేరి ఇంటర్‌పోల్‌తో కలిసి పనిచేస్తారు. నిజాయతీ, మేధస్సుతో చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరిన అధికారిగా ఆమె పాత్ర ఉంటుంది. సినిమాలో "ఆపరేషన్ ఓం"ను నడిపించేది కూడా ఆమే. ఈ పాత్రను పరిచయం చేస్తూ దర్శకుడు రాజ్‌కుమార్, సాయి పల్లవిని ‘అద్భుతమైన నటి’ అని, ‘నాయుడుపేట అమ్మాయి’ అని ప్రశంసించాడు. దీనికి సాయి పల్లవి స్పందిస్తూ, "నన్ను మరోసారి ఎంచుకున్నందుకు, ముఖ్యంగా నిత్య రెడ్డి పాత్ర కోసం ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. ఆమెలో నా ఆల్టర్ ఇగోను చూస్తున్నాను" అని బదులిచ్చింది.

ఈ భారీ యాక్షన్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ‘కార్తికేయన్’ పాత్రలో, నసీరుద్దీన్ షా మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీలీల మరో కథానాయికగా అలరించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో ధనుష్ కలప కార్మికుడిగా నటిస్తున్నట్లు సమాచారం. ‘చాప్టర్ 1’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాకు సీక్వెల్ ఉండే అవకాశం ఉంది.

ధనుష్, మమ్ముట్టి తొలిసారి వెండితెరపై కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి అక్టోబర్ 16న విడుదల కావాల్సి ఉండగా, రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రానికి గౌరవ సూచకంగా వాయిదా వేసి, నవంబర్ 20, 2026న నూతన విడుదల తేదీగా ప్రకటించారు.