వెండితెరపై దశాబ్దాలుగా తన నటనతో కోట్లాది మందిని అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. తన సుదీర్ఘ కెరీర్‌లో మరో వినూత్న అధ్యాయాన్ని మొదలుపెడుతూ, గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక ప్రత్యేకమైన టాక్ షోతో అలరించబోతున్నారు. 'మెగావర్స్' పేరుతో రూపొందుతున్న ఈ షోతో ఆయన డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం ఈ షో షూటింగ్ ప్రారంభమైంది.

భారతీయ సినిమా గొప్ప వారసత్వాన్ని, సినీ ప్రముఖుల జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా 'మెగావర్స్' రూపుదిద్దుకుంటోంది. ఈ షోలో చిరంజీవి తనదైన చరిష్మా, హాస్య చతురత, లోతైన ఆలోచనా విధానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భిన్న తరాలకు చెందిన స్టార్స్‌తో ఆయన ఆసక్తికరమైన సంభాషణలు జరపనున్నారు. అద్భుతమైన కథలు, ఎన్నో కొత్త విషయాల ఆవిష్కరణలతో ఈ షో సాగనుందని నిర్వాహకులు తెలిపారు.

తమ అభిమాన తారల జీవిత ప్రయాణాలు, తెర వెనుక కథలు, వారి వ్యక్తిగత అనుభవాలను చిరంజీవి తనదైన శైలిలో ఆవిష్కరించనున్నారు. ఆయన సహజమైన ఆత్మీయత, సందర్భోచితంగా స్పందించే తీరు ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. తరతరాలుగా ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధాన్ని పెనవేసుకున్న చిరంజీవి, ఈ వేదికపై తన ఆకట్టుకునే వ్యక్తిత్వంతో సందడి చేయనున్నారు. ఆయన హోస్టింగ్‌తో ఈ షో మరో స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, ఎస్ఓఎల్ ప్రొడక్షన్ ఎల్ఎల్ పీ సంస్థలు సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ షో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ 'మెగావర్స్'కు సంబంధించిన మరిన్ని వివరాలను, ప్రసార తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.