విజయ సేతుపతి కథానాయకుడిగా రూపొందిన 'బత్తా' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 30 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. బాలాజీ ధరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజు (అక్టోబర్ 29వ తేదీ) నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

అది 1986 వ సంవత్సరం .. ఒక అందమైన విలేజ్. ఆ ఊర్లో 'బత్తా' (విజయ్ సేతుపతి) అంటే అందరికీ భయమే. కండబలం .. గుండె బలం కలిగిన రౌడీ అతను. ఎవరినైనా కొట్టి మాట్లాడటం ఆయనకి అలవాటు. ఢిల్లీ అతని ప్రధానమైన అనుచరుడు. 'బత్తా' భార్య కణ్ణిమ (లిజోమోల్ జోస్) కూతురు 'తేను' .. ఇదే అతని కుటుంబం. జ్యోతి .. సింగరం .. రాజేంద్ర .. పెద కొండయ్య అనే వాళ్లు 'బత్తా'కి శత్రువులుగా ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. 

'బత్తా' కండబలం గురించి .. అతని హీరోయిజం గురించి స్కూల్ పిల్లలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు 'శబరి' ( సాయి పృథ్వీరాజ్)పై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఒకసారి శబరి కారణంగా 'బత్తా' కాలుకి గాయమవుతుంది. అందుకు కారణం 'శబరి' అని బత్తాకి తెలియకపోయినా ఆ కుర్రాడు భయపడుతూ ఉంటాడు. మరోసారి టీచర్ స్టాఫ్ రూమ్ లో దాచిపెట్టిన తన బొమ్మ కోసం సెలవు రోజులలో రహస్యంగా స్కూల్ కి వెళతాడు శబరి. అక్కడి వాష్ రూమ్ లో 'బత్తా' ఉన్నది చూసుకోకుండా గొళ్లెం పెట్టేస్తాడు.

వాష్ రూమ్ లో ఉన్నది 'బత్తా' అని తెలిసి శబరి ఉలిక్కిపడతాడు. అతను బయటికి వస్తే తనని చంపేస్తాడని తెలిసి పారిపోతాడు. తన కూతురు పెద్దమనిషి వేడుకకి వెళ్లడానికి బత్తా ఎంతగా ప్రయత్నించినా డోర్ రాదు. అతని కోసం అనుచరులు గాలిస్తూ ఉంటారు. అతని శత్రువులకు కూడా అతను ఏమయ్యాడనేది అర్థం కాదు. 'బత్తా' భార్య ఫిర్యాదుతో పోలీసులు గాలిస్తుంటారు. స్కూల్ కి హాలిడేస్ కావడంతో .. బత్తా గోడు ఎవరికీ వినిపించదు. శబరి మాత్రం తలుపు క్రింది నుంచి రస్కులు అందించి పారిపోతుంటాడు. రోజులు గడిచిపోతుండటంతో బత్తా ఏం చేస్తాడు? అక్కడి నుంచి బయటపడటానికి అతను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అసలు అతను అక్కడికి ఎందుకు వెళ్లాడు? అనేదే కథ.

ఒక చిన్న కుర్రాడు 'బత్తా' అనే ఒక రౌడీ బందీగా ఉండటానికి కారకుడవుతాడు. ఆ రౌడీ అంటే ఉన్న భయం కారణంగా ఆ నిజాన్ని తన మనసులోనే దాచుకుంటాడు. ఎనిమిది రోజుల పాటు బందీగా ఉన్న బత్తా అక్కడి నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? అతను బయటికి వస్తే తనని చంపేస్తాడేమోనని భయపడిన ఆ కుర్రాడు ఏం చేస్తాడు? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం. 

'బత్తా' బందీగా ఉన్న విషయం తెలియక అతని కోసం అనుచరులు వెతుకుతూ ఉంటారు. మరో వైపున పోలీసులు కూడా అతని కోసం గాలిస్తూ ఉంటారు. ఇంకొక వైపున బత్తా శత్రువులు కూడా అతని జాడ తెలియక తికమకపడుతూ ఉంటారు. మరో వైపున బత్తా భార్యాపిల్లల వెతుకులాట. వీటన్నిటినీ చూస్తూ ఆ కుర్రాడు ఎలా స్పందిస్తాడు అనేది ఈ కథలోని ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది. 

ఒక చిన్న విలేజ్ .. ఒక వైపున హీరో ఫ్యామిలీ .. మరో వైపున కుర్రాడి ఫ్యామిలీ .. ఈ రెండు కుటుంబాల చుట్టూనే ప్రధానమైన కథ తిరుగుతూ ఉంటుంది. అందునా బత్తా .. కుర్రాడు పాత్రలే మరింత ప్రధానమైనవిగా ఉంటాయి. ఈ రెండు పాత్రల చుట్టూ దర్శకుడు అల్లుకుంటూ వెళ్లిన సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. తరువాత ఏం జరుగనుందా? అనే ఒక ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ఫస్టాఫ్ ను దాటుకుని సెకండాఫ్, ప్రీ క్లైమాక్స్ ను దాటుకుని క్లైమాక్స్ కి ఈ కథ చేరుకునే విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. కానీ కుర్రాడు సాయి పృథ్వీరాజ్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పచ్చు. ఒక రౌడీకి భయపడి తప్పుపై తప్పు చేసే ఈ పాత్రలో కుర్రాడి నటన గొప్పగా అనిపిస్తుంది. అసలు ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర విజయ్ సేతుపతిదా .. ఆ కుర్రాడిదా? అనే సందేహం రాకుండా ఉండదు. మిగతా ఆర్టిస్టులంతా బాగానే చేశారు. 

 సెల్వ కుమార్ ఫొటోగ్రఫీ .. సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. కలైవానన్ ఎడిటింగ్ కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది.

పిల్లల్లో సహజంగానే భయం ఎక్కువగా ఉంటుంది. ఆ భయంతో వాళ్లు ఎక్కువ పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి ఒక పిల్లాడిలోని భయాన్ని ఒక రౌడీ ఎలా పోగొట్టాడు? ఆ రౌడీలో రాక్షసత్వాన్ని ఆ కుర్రాడు ఎలా పోగొట్టాడు? అనే ఒక బలమైన సందేశం ఈ సినిమాలో కనిపిస్తుంది. 1980లలో నడిచే ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చు.