ప్రపంచ క్రీడా యవనికపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా స్పోర్టికో నివేదిక ప్రకారం, ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఫ్రాంచైజీ 2.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 20,008 కోట్లు) అద్భుతమైన విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్ జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం.. ఐపీఎల్‌లోని ప్రతి ఫ్రాంచైజీ విలువ ఇప్పుడు కనీసం 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 14,292 కోట్లు) మార్కును దాటడం విశేషం.

విలువ పరంగా ముంబై ఇండియన్స్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1.85 బిలియన్ డాలర్లతో (రూ. 17,626 కోట్లు) రెండో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ 1.75 బిలియన్ డాలర్లతో (రూ. 16,674 కోట్లు) మూడో స్థానంలో నిలిచాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 1.73 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 1.7 బిలియన్ డాలర్లతో లీగ్ సగటు విలువకు సమానంగా ఉంది. మిగతా జట్లలో రాజస్థాన్ రాయల్స్ (1.65 బిలియన్ డాలర్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (1.62 బిలియన్ డాలర్లు), గుజరాత్ టైటాన్స్ (1.58 బిలియన్ డాలర్లు), పంజాబ్ కింగ్స్ (1.53 బిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఫ్రాంచైజీల విలువలో అసాధారణ వృద్ధి నమోదైంది. గత 18 ఏళ్లలో లీగ్ ఫ్రాంచైజీల విలువ ఏకంగా 1,800% పెరిగింది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ లీగ్‌లైన ఎన్‌ఎఫ్‌ఎల్ (800%), ఎన్‌బీఏ (1700% లోపు) వృద్ధి రేటు కంటే ఇది చాలా ఎక్కువ కావడం విశేషం. ముంబై ఇండియన్స్ విలువ కొన్ని నార్త్ అమెరికన్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీలైన డెట్రాయిట్ టైగర్స్, వాంకోవర్ కానక్స్ కంటే అధికంగా ఉండటం ఐపీఎల్ బ్రాండ్ బలాన్ని సూచిస్తోంది.

ఫ్రాంచైజీలకు ఆదాయం ఎలా వస్తుంది?
ఐపీఎల్ జట్లకు ప్రధాన ఆదాయ వనరు బీసీసీఐ నుంచి వచ్చే సెంట్రల్ రెవెన్యూ పూల్. ముఖ్యంగా బ్రాడ్‌కాస్ట్, డిజిటల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి భారీ ఆదాయం సమకూరుతుంది. ఇందులో సగం వాటాను బోర్డు ఉంచుకుని, మిగిలిన మొత్తంలో దాదాపు 90% అన్ని ఫ్రాంచైజీలకు సమానంగా పంచుతుంది. మరో 10% జట్ల ప్రదర్శన ఆధారంగా లభిస్తుంది. దీని ద్వారా ప్రతి ఫ్రాంచైజీకి ఏటా సుమారు 50-55 మిలియన్ డాలర్లు (రూ. 476 కోట్ల నుంచి రూ. 523 కోట్ల వరకు) అందుతాయి.

ఇది కాకుండా టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్‌షిప్‌లు, వాణిజ్య భాగస్వామ్యాల ద్వారా కూడా జట్లు అదనపు ఆదాయాన్ని పొందుతాయి. వేలంలో ఆటగాళ్ల జీతాలపై పరిమితులు ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో ఫ్రాంచైజీలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. కొన్ని జట్ల లాభాల మార్జిన్ 30% దాటుతుండటంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడులుగా మారాయి.