మనోజ్ బాజ్ పాయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను తనదైన స్టైల్లో ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. ఆయన నటన కోసం మళ్లీ మళ్లీ ఆ సినిమాలు చూసే అభిమానులు ఉన్నారు. అలాంటి మనోజ్ బాయ్ నుంచి వచ్చిన సినిమా ఒకటి ఈ నెల 23వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా పేరే 'గజబ్ రాత్'.  రితేష్ షా దర్శకత్వం వహించిన ఈ సినిమా, హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది.

అజయ్ నిర్విత్ ( మనోజ్ బాజ్ పాయ్) ఢిల్లీలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. నీతి .. నిజాయితీ అనే వాటికి చాలా దూరంగా కనిపించే ఆఫీసర్ అతను. స్త్రీల పట్ల వ్యామోహం కూడా ఎక్కువ. తన సంతోషం .. సరదా తప్ప ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా ఆయన పట్టించుకోడు.  డబ్బు కోసం అవినీతికి పాల్పడటంలో .. అవకాశానికి తగినట్టుగా నడచుకోవడంలో ఆయనకి ఆయనే సాటి అనే పేరు ఉంటుంది. డిపార్టుమెంటులో కూడా ఈ విషయం అందరికీ తెలుసు.

అలాంటి అజయ్ చేతికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆర్య సహానీ కేసు వస్తుంది. నడిరోడ్డుపై చావు బ్రతుకులలో ఉన్న ఆమెను అతనే హాస్పిటల్లో చేరుస్తాడు. ఆమె దగ్గర ఏదో రహస్య సమాచారం ఉందనీ, అందువల్లనే ఆమెను చంపాలనే ఉద్దేశంతో పెద్దతలకాయలు ఉన్నాయనే విషయం అతనికి అర్థమవుతుంది. అజయ్ అలవాటు ప్రకారం డబ్బు తీసుకుని ఈ కేసును క్లోజ్ చేయాలని భావిస్తాడు. అయితే ఆర్య సహానీ ఒక జర్నలిస్ట్ అనీ .. ఆమె ఆశయం గొప్పదని ఆ సమయంలోనే అతనికి తెలుస్తుంది.

అప్పటి వరకూ అవినీతి ఆఫీసర్ గా ముద్రపడిన అజయ్ నీ ఆర్య సహానీ కేసు నిజాయితీ పరుడిగా మారుస్తుంది. ఆమెను కాపాడటం కోసం అతను ఏం చేస్తాడు? అనేదే కథ. ఆరంభంలో అవినీతి పరుడైన .. స్వార్థపరుడైన పోలీస్ ఆఫీసర్ గా .. ఆ తరువాత నిజాయితీపరుడిగా మారిపోయిన పోలీస్ అధికారిగా మనోజ్ బాజ్ పాయ్ నటన ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవలసి ఉంటుంది. కథ ఎక్కువ భాగం హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పటికీ .. అక్కడక్కడా కథనం కాస్త మందగించినప్పటికీ, మనోజ్ బాజ్ పాయ్ నటన కట్టి పడేస్తుంది. ఆయన మార్క్ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు.