భారత యువ క్రికెటర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఓ అభిమానితో జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఈ ఘటన నెటిజన్ల మనసులను గెలుచుకుంది. ఆప్యాయత నిండిన ఈ వీడియోపై ప్రశంసలు కురుస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత, వైభవ్ బౌండరీ లైన్ వద్ద అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నాడు. అదే సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఓ మహిళా అభిమాని.. "వైభవ్.. మేము కూడా బల్లియా నుంచే వచ్చాం. ఎలా ఉన్నావ్? వేడి నీళ్లు తాగు, చల్లటి నీళ్లు తాగొద్దు" అని హిందీలో ఆప్యాయంగా పలకరించారు. న్యూజిలాండ్‌లోని చల్లటి వాతావరణంలో, ఓ తల్లిలా ఆమె ఇచ్చిన సలహాకు వైభవ్ చిరునవ్వుతో బదులిచ్చాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైభవ్ సొంత ఊరు బల్లియా నుంచే తాము కూడా వచ్చామని చెప్పి, అతని ఆరోగ్యంపై చూపిన శ్రద్ధ అందరినీ ఆకట్టుకుంది. బ్యాటింగ్‌తోనే కాకుండా, తన ప్రవర్తనతోనూ వైభవ్ అభిమానులను సంపాదించుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో 45 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ (113)తో కలిసి బలమైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో భారత్ 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.