'అర్జున్ రెడ్డి', 'జాతిరత్నాలు' వంటి చిత్రాలతో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన విలక్షణ నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలో మెగాఫోన్ పట్టబోతున్నారు. నటుడిగా మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, దర్శకత్వంపై దృష్టి సారించినట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'హుషారు-2' సినిమా పూర్తయిన వెంటనే దర్శకత్వ బాధ్యతలు చేపడతానని వెల్లడించారు.

వచ్చే ఏడాది తన దర్శకత్వంలో సినిమా ఉండొచ్చని రాహుల్ సూచనప్రాయంగా తెలిపారు. ఇది పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే తానే రాసుకున్నానని చెప్పారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటుల ఎంపిక కూడా పూర్తయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. 

కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా హీరో ఫ్రెండ్ పాత్రలే రావడం, అవే పాత్రలు పదేపదే చేయాల్సి రావడంతో విసుగు చెందానని, అందుకే దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నానని రాహుల్ వివరించారు. ప్రస్తుతం శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో 'హుషారు-2'లో నటిస్తున్న రాహుల్, దర్శకుడిగా ఎలాంటి వినోదాన్ని పంచుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.