విలక్షణ నటుడు నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ పూర్తయింది. ఆయన కెరీర్‌లో ఇది 51వ చిత్రం కావడంతో, తాత్కాలికంగా 'ఎన్‌సీ 51' అనే టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పిలుస్తున్నారు. ఆర్.పి. బాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో ముగిసింది. ఈ విషయాన్ని నవీన్ చంద్ర స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఈ చిత్రంలో నవీన్ చంద్ర సరసన హరిప్రియ రోషిణి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాల శరవణన్, కాళీ వెంకట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

దర్శకుడు ఆర్.పి. బాల ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి. ముత్తయ్య మరో నిర్మాతగా ఉంటూ సినిమాకు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. శక్తి బాలాజీ సంగీతం, అజయ్ మనోజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.