ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులతో జరిపిన సమావేశాలు ఫలప్రదంగా ముగిశాయి. ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే, ఐటీ రంగాల అభివృద్ధికి సంబంధించి కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో జరిపిన భేటీలో పలు కీలక హామీలు, ఆమోదాలు లభించాయి. రాష్ట్ర భవిష్యత్‌కు అత్యంత కీలకమైన సెమీకండక్టర్ డిజైన్, ఏఐ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమై రాష్ట్ర ప్రగతికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. ఈ భేటీలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరిగింది. ఒకటి, ఆంధ్రప్రదేశ్‌ను సెమీకండక్టర్ డిజైన్, తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడం. 

రెండోది, రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. ఈ రెండు అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. సెమీకండక్టర్ రంగంలో పరిశోధన, అభివృద్ధి (R&D), నైపుణ్య శిక్షణ, సామర్థ్యాల పెంపునకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ద్వారా అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు. అలాగే, కృత్రిమ మేధ (AI) అభివృద్ధి, ఏఐ మౌలిక సదుపాయాల కల్పనలోనూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

పట్టాలెక్కనున్న రైల్వే ప్రాజెక్టులు

రైల్వే రంగంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను, అవసరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి సమగ్రంగా వివరించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లకు (DPR) ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా, రాష్ట్రంలోని 9 పోర్టుల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అవసరమైన రైల్వే కనెక్టివిటీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పోర్టుల ద్వారా ఎగుమతులు, దిగుమతులు పెరిగి పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు భారీ ప్రాజెక్టుల ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ బైపాస్ లైన్ నిర్మాణానికి రూ.3,197 కోట్లు, కొవ్వూరు–భద్రాచలం రైల్వే ప్రాజెక్టుకు రూ.2,860 కోట్లు, ఒంగోలు–దొనకొండ రైల్వే ప్రాజెక్టుకు రూ.1,800 కోట్లు, అనకాపల్లి–కొత్తవలస బైపాస్ ప్రాజెక్టుకు రూ.2,190 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. విజయవాడ బైపాస్‌లో భాగంగా కృష్ణా నదిపై రెండు కొత్త వంతెనల నిర్మాణం ఆవశ్యకతను నొక్కిచెప్పారు. అమరావతి–విశాఖపట్నం మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు చేయాలని, అలాగే విజయవాడ–ఇటార్సీ, ఖరగ్‌పూర్–విజయవాడ రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పెంచేలా నాలుగు లైన్ల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని సూచించారు. అమరావతి, విశాఖపట్నంలో భారీ కోచింగ్ టెర్మినళ్ల ఏర్పాటుకు, రైల్వే పీఎస్‌యూ కార్యాలయాలను అమరావతిలో నెలకొల్పే అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.

విశాఖ వాసులకు శుభవార్త.. కొత్త రైళ్లకు పచ్చజెండా

ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే దిశగా ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణమే స్పందించారు. విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు స్లీపర్ సౌకర్యంతో కూడిన వందే భారత్ రైలును నడిపేందుకు ఆయన అంగీకారం తెలిపారు. దీనితో పాటు, విశాఖపట్నం–తిరుపతి మధ్య పగటిపూట సీటింగ్ సౌకర్యంతో మరో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టేందుకు కూడా సమ్మతించారు. కొత్తగా నిర్మించిన కనిగిరి–విజయవాడ రైల్వే మార్గంలో ప్రయాణికుల రైలు సేవలను వెంటనే ప్రారంభించాలని సీఎం కోరారు. ముఖ్యమంత్రి వెంట ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. మొత్తం మీద, ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపునిచ్చేలా సాగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ రాత్రి ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి విజయ్ బిష్ణోయ్ ఇంట జరిగే పెళ్లి వేడుకలో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబు శనివారం రాత్రి ఢిల్లీలోనే బస చేసి, ఆదివారం ఉదయం విజయవాడకు తిరిగి రానున్నారు.