ఎన్ని రోజులు బయట తిరిగినా, ఇంటి భోజనం ఇచ్చే అనుభూతి వేరు. ముఖ్యంగా అమ్మ చేతి వంటకు ఏదీ సాటిరాదనిపిస్తుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా అమ్మ చేతి వంట అంటే ఎంతో ఇష్టం. సుదీర్ఘ క్రికెట్ పర్యటనల నుంచి ఇంటికి తిరిగి వచ్చే ముందు, తనకు ఇష్టమైన వంటకాలు సిద్ధం చేయమని అమ్మను కోరేందుకు ఆయన ఏం చేసేవారో తాజాగా ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుదీర్ఘ పర్యటనల్లో ఉన్నప్పుడు అమ్మ చేతి వంటను చాలా మిస్ అయ్యేవాడినని సచిన్ గుర్తుచేసుకున్నారు. అందుకే, పర్యటన ముగించుకుని ఇంటికి బయలుదేరడానికి రెండు మూడు రోజుల ముందే అమ్మకు ఫోన్ చేసేవాడినని తెలిపారు. తనకు ఇష్టమైన మహారాష్ట్ర సంప్రదాయ వంటకాలైన వరణ్ భాత్ (పప్పు అన్నం), బటాటా భాజీ (బంగాళదుంప కూర), రొయ్యల కూర వంటివి సిద్ధం చేయమని అడిగేవాడినని చెప్పారు.

తన తల్లి వంట రెసిపీలు ఇంట్లో అందరికీ తెలిసినా, ఆమె చేతితో చేస్తే వచ్చే రుచి మాత్రం వేరని సచిన్ అన్నారు. "మా అమ్మలా ఎవరూ వండలేరు" అని ఆయన పేర్కొన్నారు. ఆ భోజనంలో కాస్త నెయ్యి వేసుకుని చేత్తో తింటుంటే ఆ మజాయే వేరని సచిన్ ఉత్సాహంగా వివరించారు.