యూరప్ యాత్ర ఎంతో మధురంగా ఉంటుందని ఊహించుకున్న ఓ భారత జంటకు ఫ్రాన్స్‌లో ఊహించని షాక్ తగిలింది. కేవలం రూ.300 విలువైన ట్రామ్ టికెట్ విషయంలో జరిగిన ఒక చిన్న పొరపాటుకు, ఏకంగా రూ.13,000 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ సంఘటన యూరప్ పర్యటనకు వెళ్లే వారికి ఒక ముఖ్యమైన హెచ్చరికగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. వంచ, సాక్షమ్ అనే భారత ట్రావెల్ క్రియేటర్ల జంట (@pathandpassports ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ప్రసిద్ధులు) తమ మొదటి యూరప్ ట్రిప్‌లో భాగంగా ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రయాణం కోసం ఒక వెండింగ్ మెషీన్ నుంచి ట్రామ్ టికెట్ కొనుగోలు చేశారు. అయితే, ఆ టికెట్‌ను పక్కనే ఉన్న చిన్న కియోస్క్ వద్ద ట్యాప్ చేసి "వాలిడేట్" చేయాలన్న నిబంధన వారికి తెలియదు. దీంతో వారు నేరుగా ట్రామ్ ఎక్కేశారు.

రెండు స్టాప్‌లు దాటిన తర్వాత ఒక టికెట్ ఇన్‌స్పెక్టర్ వారి వద్దకు వచ్చి టికెట్లను తనిఖీ చేశారు. వారు టికెట్ చూపించినా, అది వాలిడేట్ చేయనందున చెల్లదని చెప్పి, అక్కడికక్కడే భారీ జరిమానా విధించారు. తాము పర్యాటకులమని, నిబంధన తెలియక పొరపాటు జరిగిందని, కావాలని చేయలేదని వారు ఎంతగానో వివరించే ప్రయత్నం చేశారు. తామేమీ తప్పు చేయలేదని వాదించారు. తమ వద్ద ఉన్న బుకింగ్స్ చూపించి, తమ ఎయిర్‌బీఎన్‌బీ హోస్ట్‌తో కూడా మాట్లాడించారు. అయినప్పటికీ, అధికారి కనికరించకుండా పూర్తి జరిమానా మొత్తాన్ని వసూలు చేశారు.

ఈ అనుభవాన్ని వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో రూపంలో పంచుకోగా, అది వైరల్‌గా మారింది. ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో ఇది సర్వసాధారణమని, టికెట్ కొని వాలిడేట్ చేయకపోతే భారీ జరిమానాలు తప్పవని పలువురు కామెంట్ల రూపంలో తెలిపారు. సరైన సూచనలు లేకపోవడం, ఫైన్‌ల ద్వారా ఇన్‌స్పెక్టర్లకు ప్రోత్సాహకాలు ఉండటం వంటివి ఈ సమస్యకు కారణమని కొందరు అభిప్రాయపడ్డారు.

ఫ్రాన్స్ సహా పలు యూరప్ దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థలో టికెట్ కొనడం ఒక ఎత్తయితే, దానిని ప్రయాణానికి ముందు కచ్చితంగా వాలిడేట్ (స్టాంప్ లేదా ట్యాప్) చేయడం మరో ముఖ్యమైన నిబంధన. ఈ విషయం తెలియక ఎంతో మంది పర్యాటకులు ఇలా ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి, యూరప్‌కు వెళ్లే ప్రయాణికులు స్థానిక రవాణా నిబంధనలను ముందుగానే తెలుసుకొని, జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం.