సోషల్ మీడియాలో చీరకట్టుతో పరుగెత్తి అందరి హృదయాలు గెలుచుకున్న ఝార్ఖండ్‌కు చెందిన కవిత కథ నిరాశ‌జ‌న‌కంగా ముగిసింది. తన జీవితాన్ని మార్చుతుందనుకున్న హోంగార్డు ఉద్యోగ నియామక పరీక్షలో ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. పరుగు పందెంలో నిర్దేశిత సమయం కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ, హైజంప్‌లో విఫలమవడంతో ఉద్యోగం పొందే అవకాశాన్ని కోల్పోయింది.

ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి కవిత, ఇటీవల జరిగిన హోంగార్డు నియామక పరీక్షకు హాజరైంది. ఈ పరీక్షలో భాగంగా నిర్వహించిన 1600 మీటర్ల పరుగు పందెంలో ఆమె అద్భుత ప్రతిభ కనబరిచింది. 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన ఈ పరుగును కేవలం 8 నిమిషాల 57 సెకన్లలోనే పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమె ఉద్యోగానికి ఎంపికవడం ఖాయమని అంతా భావించారు.

అయితే, తర్వాతి దశ అయిన హైజంప్ పరీక్షలో కవిత విఫలమైంది. అధికారులు ఆమెకు మూడుసార్లు అవకాశం ఇచ్చినా, నిర్దేశిత ఎత్తును దాటలేకపోయింది. దీంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. ఈ పరీక్షకు మొత్తం 930 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు.

సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యిందంటే..!
కొద్ది రోజుల క్రితం సిడో-కన్హు జిల్లా మైదానంలో ఓ ప్రైవేట్ అకాడమీ నిర్వహించిన ట్రయల్ రన్‌లో కవిత పాల్గొన్నారు. పేదరికం కారణంగా కనీసం బూట్లు కూడా లేకపోవడంతో ఆమె చీరకట్టుతోనే చెప్పులు లేకుండా పరుగెత్తారు. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం కావ‌డం, అవి కాస్తా వైర‌ల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే సంచలనంగా మారారు.

భర్త కొన్నేళ్ల క్రితం మరణించడంతో ఇద్దరు పిల్లలు, వృద్ధులైన అత్తామామల సంరక్షణ బాధ్యత కవితపై పడింది. కుటుంబ పోషణ కోసం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఆమె ఈ పరీక్షకు సిద్ధమైంది. ఆమె కథ వైరల్ అయ్యాక ఎందరో దాతలు ముందుకు వచ్చి సహాయం చేశారు. 

పరుగు పందెంలో గెలుపు ఆమె కలను సాకారం చేస్తుందన్న ఆశలు రేకెత్తించింది. కానీ, హైజంప్‌లో వైఫల్యం ఆమె ఎంపిక అవకాశాలను పూర్తిగా మూసేసింది. కష్టాలను ఎదుర్కొనే సంకల్పాన్ని ఆమె కథ గుర్తుచేయడమే కాకుండా, కనీస సౌకర్యాలు లేని పేద అభ్యర్థులు తమ కలలను నెరవేర్చుకోవడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా కళ్లకు కట్టింది.