బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులతో ఆయన సమావేశమై పరిస్థితిని అంచనా వేశారు.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారే ప్రమాదం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీని ప్రభావంతో రానున్న మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. "తుపాను ప్రభావంతో తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే వెళ్లిన వారిని వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేయాలి" అని ఆదేశించారు. తుపాను ప్రభావితమయ్యే జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ప్రజలకు అత్యవసర సహాయం, సమాచారం అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో భయాందోళనలు తొలగించాలని, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.