తెలంగాణలో సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లులు విడుదల చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చస్తే గానీ బిల్లులు చెల్లించరా? అంటూ ప్రశ్నించారు. అవసరమైతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన అనిరుధ్‌రెడ్డి సోమవారం రాజాపూర్‌ మండలంలోని రంగారెడ్డిగూడ, గుండ్లపొట్లపల్లి సహా పలు గ్రామాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో పూర్తయిన పనులతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు చెల్లిస్తారా?
ప్రభుత్వం, సచివాలయం తీరుపై అనిరుధ్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల నియోజకవర్గాల్లోనే బిల్లులు చెల్లిస్తారా? మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇటీవల ఓ కాంట్రాక్టర్‌ చనిపోయిన తర్వాత ఆయనకు రూ.5 కోట్ల బిల్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తన నియోజకవర్గ పనుల బిల్లుల కోసం తాను చనిపోతేనే నిధులు విడుదల చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నీళ్ల కోసం పార్టీలకు అతీతంగా పోరాటం
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ప్రభుత్వం నిలబడుతుందని అనిరుధ్‌రెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు పార్టీలకు అతీతంగా పోరాడతామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా వెళతానని చెప్పారు.

తన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బిల్లుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.