ఆ నలుగురికి కచ్చితంగా శిక్ష పడుతుంది: రాహుల్ గాంధీ
Add ap7am to your home Screen

ఆ నలుగురికి కచ్చితంగా శిక్ష పడుతుంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi says those four will definitely be punished
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్
  • మూడో రోజుకు చేరిన ఇండియా కూటమి నిరసనలు
  • మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారన్న రాహుల్
  • వారికి శిక్ష తప్పదని, ఇది తన హామీ అని వ్యాఖ్య
  • రేపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవనున్న విపక్ష ఎంపీలు
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'ఇండియా' కూటమి ఢిల్లీలో చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. గురువారం సైతం విపక్ష ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"మోదీ, అమిత్‌ షా, మోహన్ భగవత్, జ్ఞానేశ్ కుమార్.. ఈ నలుగురూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది, అది మీరే చూస్తారు. ఇది మా హామీ" అని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. "మొదటి రోజు మమ్మల్ని ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నిన్న జంతర్ మంతర్‌కు వెళ్లనివ్వలేదు. మా ఎంపీలపై దాడి చేశారు" అని ఆయన పేర్కొన్నారు.

నిరసనల్లో భాగంగా విపక్ష ఎంపీలు తొలుత రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. కాగా, ఈ అంశంపై తదుపరి కార్యాచరణకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో విపక్ష ఎంపీలు భేటీ కానున్నారు. ఇందుకోసం ఇప్పటికే అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల గురించి వారు రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు.
Advertisement
Rahul Gandhi
Narendra Modi
Amit Shah
INDIA Alliance Protest
Election Commission
Gyanesh Kumar

More Telugu News