జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై సీపీ సజ్జనార్ ఆగ్రహం.. కార‌ణ‌మిదే!
Add ap7am to your home Screen

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై సీపీ సజ్జనార్ ఆగ్రహం.. కార‌ణ‌మిదే!

VC Sajjanar expresses anger over Junior NTR fans for fake photo circulation
  • తన ఫొటోను మార్ఫ్ చేశారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సజ్జనార్ అసంతృప్తి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఏఐ సృష్టించిన ఫేక్ అని స్పష్టీకరణ
  • ఈ విషయాన్ని గమనించాలంటూ నటుడు ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేసిన వైనం
  • నిజనిజాలు తెలుసుకోకుండా కంటెంట్‌ను ఫార్వర్డ్ చేయవద్దని నెటిజన్లకు విజ్ఞప్తి
  • చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తీరుపై పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఫొటోను మార్ఫింగ్ చేసి, ఒక ఫేక్ చిత్రాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని నేరుగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తూ ఆయన అధికారిక 'ఎక్స్' ఖాతాను ట్యాగ్ చేయడం గమనార్హం.

ఇటీవల 'చుట్టమల్లే' పాట వివాదానికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు 'సౌత్ డిజిటల్ మీడియా' అనే ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. దీనికి జత చేసిన ఫొటోలో, ఒక వ్యక్తికి ముసుగు వేసి ఉండగా, ఆయన పక్కన పోలీసులు, కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఉన్నట్లు కనిపించింది. ఈ ఫొటోలో కమిషనర్ సజ్జనార్ చిత్రం కూడా ఉంది. ఇది కొద్దిసేపట్లోనే వైరల్ కావడంతో సజ్జనార్ స్పందించారు.

వైరల్ అవుతున్న ఆ ఫొటో నిజమైనది కాదని, అది పూర్తిగా ఏఐతో సృష్టించిన డీప్‌ఫేక్ చిత్రమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను చూసి మోసపోవద్దని, వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతీదాన్ని గుడ్డిగా నమ్మవద్దని సూచించారు.

ఈ ఫేక్ ఫొటోను కొందరు ఎన్టీఆర్ అభిమానులే ప్రచారంలోకి తెచ్చినట్లు గుర్తించిన సజ్జనార్.. "మీ అభిమానుల్లో కొందరు నా ఫొటోను ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్న అంశాన్ని దయచేసి గమనించండి" అంటూ జూనియర్ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ కోరారు. 

సైబర్ నేరాలు, డీప్‌ఫేక్‌లపై నిరంతరం ప్రజలను అప్రమత్తం చేసే సజ్జనార్ స్వయంగా ఇలాంటి ఫేక్ ప్రచారానికి గురికావడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. ఏఐని ఆయుధంగా వాడుతూ తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Advertisement
VC Sajjanar
Junior NTR
Jr NTR Fans
Deepfake Photo
Cyber Crime
Chuttamalle Song Controversy

More Telugu News