సీఎం అయ్యాక నన్ను స్టింగ్‌ ఆపరేషన్‌తో ఇరికించే ప్రయత్నం.. డీకే శివకుమార్‌ సంచలన ఆరోపణలు
Add ap7am to your home Screen

సీఎం అయ్యాక నన్ను స్టింగ్‌ ఆపరేషన్‌తో ఇరికించే ప్రయత్నం.. డీకే శివకుమార్‌ సంచలన ఆరోపణలు

DK Shivakumar sensational allegations on attempt to trap him in sting operation after becoming CM
  • తన వద్ద ఫొటోలు, పత్రాలు ఉన్నాయని వెల్లడి
  • పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ప్రకటన
  • స్టింగ్‌ వెనుక ఉన్నవారు ఎవరో తెలుసన్న సీఎం
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • తనతో పాటు మరికొందరిపై స్టింగ్స్‌ జరుగుతున్నాయని ఆరోపణ
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. తాను సీఎం అయిన తర్వాత తనను స్టింగ్‌ ఆపరేషన్‌లో ఇరికించేందుకు ప్రయత్నం జరిగిందని చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, పత్రాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో తనకు తెలుసని అన్నారు.

ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడిన శివకుమార్‌.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు వ్యక్తులు తనను కలిశారని చెప్పారు. వారెవరో, ఎవరి కోసం వచ్చారో తనకు తెలుసన్నారు. ‘‘నన్ను ఇరికించేందుకు ప్రయత్నం చేశారు. నా వద్ద ఫొటోలు ఉన్నాయి. ఈ స్టింగ్‌ ఆపరేషన్ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలుసు’’ అని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు శివకుమార్‌ వెల్లడించారు. తనను కలిసిన వ్యక్తులకు సంబంధించిన పత్రాలను భద్రపరిచినట్లు చెప్పారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు బయటపెట్టలేనన్నారు.

‘‘వాళ్లు ఏం మాట్లాడేందుకు వచ్చారు? ఎలా వచ్చారు? ఎవరిని కలిశారు? అన్నీ నాకు తెలుసు. దీని వెనుక ఎవరు ఉన్నారో కూడా తెలుసు’’ అని శివకుమార్‌ అన్నారు.

ప్రభుత్వ అధికారులను కూడా ఇలాంటి ఉచ్చుల్లోకి లాగవచ్చని హెచ్చరించిన ఆయన.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. తన చుట్టూ మూడు స్థాయుల్లో వ్యక్తులు ఉంటారని, కొందరిని ప్రత్యేకంగా నియమించినట్లు తనకు సమాచారం ఉందని ఆరోపించారు.

తనపైనే కాకుండా మరికొందరిపైనా స్టింగ్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయని శివకుమార్‌ ఆరోపించారు. వాటి వెనుక ఎవరు ఉన్నారు? వాటికి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు? అన్న సమాచారం తన వద్ద ఉందని చెప్పారు. తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ మంత్రులను లక్ష్యంగా చేసుకుని స్టింగ్‌ ఆపరేషన్లు జరిగే అవకాశం ఉందని ఇటీవల కేబినెట్‌ సమావేశంలో శివకుమార్‌ హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శివకుమార్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హెచ్‌.డీ. కుమారస్వామి ప్రశ్నలు లేవనెత్తారు.

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. స్టింగ్‌ ఆపరేషన్లు నిర్వహించి వాటితో వ్యక్తులను బ్లాక్‌మెయిల్‌ చేయడం కాంగ్రెస్‌కు గతంలోనూ అలవాటేనని ఆరోపించారు. బీజేపీ నేత ఆర్‌. అశోక్‌ కూడా శివకుమార్‌ గతంలో ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్నందుకే ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు.
Advertisement
DK Shivakumar
Sting Operation Allegations
Karnataka Politics
Congress BJP Row
HD Kumaraswamy
Political Conspiracy Karnataka

More Telugu News