నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్‌లు.. వాటిని మెడల్స్ గా భావిస్తా: రాహుల్ గాంధీ

నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్‌లు.. వాటిని మెడల్స్ గా భావిస్తా: రాహుల్ గాంధీ

Rahul Gandhi says my goal is 100 FIRs and I consider them as medals
  • తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై స్పందించిన రాహుల్ గాంధీ
  • తనపై ఇప్పటికే  45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని వెల్లడి
  • 'ఇండియా' కూటమి ఎంపీలతో ఖర్గే భోజన సమావేశం
  • ఈసీపై పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం
  • భేటీ అనంతరం జంతర్ మంతర్‌లో నిరసనకు విపక్షాలు సిద్ధం
నిన్న ఈసీ కార్యాలయం ముట్టడి నేపథ్యంతో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తేలిగ్గా తీసుకున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తన లక్ష్యం 100 ఎఫ్‌ఐఆర్‌లు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు చేసుకున్నా తానేమీ వెనుకంజ వేయబోనని, ఆ కేసులను మెడల్స్ గా భావిస్తానని అన్నారు. సీఈసీ పదవికి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేని పునరుద్ఘాటించారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో నేడు జన్‌పథ్‌లోని సాగర్ రత్న రెస్టారెంట్‌లో విపక్ష ఎంపీల భోజన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని, 'ఓట్ల దొంగతనం' అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇదే సమావేశంలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ.. 'ఇది లంచ్ మాత్రమే కాదు, ఒక లాంచ్ కూడా కావచ్చు' అని చమత్కరించారు.

కాగా, మంవారం 'ఓట్ల దొంగతనం' జరిగిందంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న విపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలు ఆకాశవాణి భవన్‌లోకి ప్రవేశించి సుమారు 8 గంటల పాటు బైఠాయించారు. అనుమతి లేకుండా భవనంలోకి ప్రవేశించినందుకు పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఎఫ్‌ఐఆర్‌పై స్పందిస్తూ రాహుల్ గాంధీ, "నాపై ఇప్పటికే 45 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. నా లక్ష్యం 100" అని తేలికగా వ్యాఖ్యానించారు. భోజన భేటీ అనంతరం, ఎంపీలందరూ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్న బస్సుల్లో బయలుదేరారు. మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, జ్ఞానేశ్ కుమార్ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, పోలీసులు జంతర్ మంతర్, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.


Advertisement
Rahul Gandhi
FIR against Rahul Gandhi
Election Commission protest Delhi
CEC Gyanesh Kumar resignation
Mallikarjun Kharge opposition meeting
Vote theft allegations India

More Telugu News