ఏఐతో 100 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు: బిల్‌గేట్స్

ఏఐతో 100 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు: బిల్‌గేట్స్

Bill Gates warns AI could endanger 100 crore lives
  • దుష్టశక్తుల చేతిలో ఏఐతో పెను ప్రమాదమన్న బిల్‌గేట్స్
  • పరిశ్రమ స్వీయ నియంత్రణ సరిపోదని, ప్రభుత్వ చట్టం అవసరమని స్పష్టీకరణ
  • సైబర్ దాడులు, జీవ ఆయుధాల వంటి ప్రమాదాలపై ఆందోళన
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై సంచలన హెచ్చరికలు జారీ చేశారు. దుష్టశక్తుల చేతిలో ఏఐ చిక్కితే అది దాదాపు 100 కోట్ల మంది మరణాలకు దారితీసే పెను విపత్తుకు కారణం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ అమెరికన్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏఐ స్వయంగా మానవాళిని నాశనం చేస్తుందని తాను భావించడం లేదని గేట్స్ స్పష్టం చేశారు. అయితే, దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు ఆధునిక ఏఐ టూల్స్‌ను ఉపయోగించి చేసే సైబర్ దాడులు, జీవాయుధాల (బయో వెపన్స్) ప్రయోగం వంటివి ఊహించని నష్టాన్ని కలిగిస్తాయని వివరించారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి పరిశ్రమ స్వీయ నియంత్రణ సరిపోదని, ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆయన సూచించారు. వాషింగ్టన్‌లో దీనిపై చట్టం తీసుకురావడం తప్పనిసరి అని, ఇది పరిశ్రమపై కొంత భారం మోపినప్పటికీ, అభివృద్ధిని పెద్దగా నిరోధించదని అన్నారు.

ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌, ఆంత్రోపిక్‌ సీఈవో డారియో అమోడీ వంటి ఇతర టెక్ నిపుణులు కూడా ఏఐ నియంత్రణ ఆవశ్యకతపై గళం విప్పిన విషయం తెలిసిందే. రాబోయే ఐదేళ్లలో మానవుల కంటే తెలివైన 'సూపర్ ఇంటెలిజెంట్' ఏఐ వ్యవస్థలు వచ్చే అవకాశం ఉందని, వాటిపై మానవ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని బ్రిటన్‌కు చెందిన అలన్ ట్యూరింగ్ ఇనిస్టిట్యూట్ నివేదిక కూడా ఇటీవల హెచ్చరించింది.

ప్రస్తుతం ఏఐ ఏజెంట్లు అనధికారికంగా హ్యాకింగ్ ప్రయత్నాలు చేయడం, డ్రోన్ దాడులకు ప్లాన్ చేయడం వంటి ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో గేట్స్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏఐ అభివృద్ధి వేగం, దాని దుర్వినియోగం వల్ల మానవాళికి ఎదురయ్యే ప్రమాదాలపై ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చను రేకెత్తించాయి. 
Advertisement
Bill Gates
Artificial Intelligence Risk
AI Bio Weapons Threat
AI Regulation Laws
Microsoft Founder Warning
AI Cyber Attacks Safety

More Telugu News