వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ మృతి.. జగన్ దిగ్భ్రాంతి
- ఈ ఉదయం గుండెపోటుకు గురైన రాజశేఖర్
- హైదరాబాద్ లోని నివాసంలో కన్నుమూత
- పార్టీ కోసం అంకితభావంతో పని చేశాడన్న జగన్
ఏపీ లిడ్‌క్యాప్ మాజీ ఛైర్మన్, వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి పట్ల ఆ పార్టీ అధినేత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈ ఉదయం గుండెపోటుతో రాజశేఖర్ కన్నుమూశారు. సమాచారం అందుకున్న జగన్ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబానికి ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పార్టీకి రాజశేఖర్ అందించిన సేవలను వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. వైసీపీ కోసం రాజశేఖర్ అంకితభావంతో పనిచేశారని, ప్రతి కార్యక్రమంలోనూ అత్యంత చురుగ్గా పాల్గొంటూ తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారని కొనియాడారు.