భారీ వర్షాలు.. జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు
- వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు ఏ అధికారి కూడా అశ్రద్ధ వహించకూడదన్న చంద్రబాబు
- లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశం
- ఆహారం, మంచినీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్న సీఎం
ఏపీలో తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలు, ముందస్తు ప్రాణ నష్ట నివారణ చర్యలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
వరద ముంపునకు గురైన బాధితులకు నాణ్యమైన ఆహారం, మంచినీరు, అత్యవసర వైద్య సదుపాయాలు మరియు మందులు నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. ఈదురు గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగితే తక్షణమే పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా, వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టంపై కచ్చితమైన అంచనాలు రూపొందించి నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం అండగా నిలుస్తుందనే నమ్మకం కలిగించాలని కలెక్టర్లకు తేల్చి చెప్పారు.