సాహిల్ తల్లిదండ్రులకు రాహుల్ గాంధీ ఫోన్.. పార్టీ అండగా ఉంటుందని హామీ
- దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ ఆత్మహత్య
- సాహిల్ కుటుంబానికి ధైర్యం చెప్పిన రాహుల్ గాంధీ
- అణగారిన విద్యార్థులపై జరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు అవసరమని వ్యాఖ్య
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. సాహిల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ధైర్యం చెబుతూ... సాహిల్ కి పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వెనుకబడిన, అణగారిన వర్గాల విద్యార్థులపై జరుగుతున్న వేధింపులకు అడ్డుకట్ట వేసేలా బలమైన వ్యవస్థీకృత చర్యలు అత్యవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ప్రొఫెసర్ సూర్యనారాయణ దుళ్ళ తీవ్ర మానసిక వేధింపులకు గురిచేయడం, కుల దూషణలకు పాల్పడటం వల్లే సాహిల్ మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్‌లో విద్యార్థి సంఘాల పెద్దఎత్తున నిరసనలు, తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఐఐటీ బాంబే యాజమాన్యం స్పందించింది. నిష్పాక్షిక విచారణకు వీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణను విధులకు దూరంగా ఉంచుతూ సెలవుపై పంపినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తుతో పాటు ఐఐటీ అంతర్గత కమిటీ విచారణ వేగవంతం చేసింది.