బిహార్‌లో మరో యువతికి వేధింపులు.. వీడియో వైరల్‌.. ఐదుగురు అదుపులోకి!

బిహార్‌లో మరో యువతికి వేధింపులు.. వీడియో వైరల్‌.. ఐదుగురు అదుపులోకి!

  • సమస్తిపూర్‌లో యువతిపై వేధింపుల ఆరోపణలు
  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
  • ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఇద్దరు అనుమానితులను గుర్తించిన అధికారులు
  • ఘటనలో ఉన్న ఇతరుల వివరాలపై ఆరా
బిహార్‌లో మరో యువతిని కొందరు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. జముయ్‌లో పదో తరగతి బాలికపై వేధింపుల ఘటన జరిగిన కొన్ని రోజులకే సమస్తిపూర్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. యువతిని కొందరు చుట్టుముట్టి వేధిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సమస్తిపూర్‌ జిల్లా కేంద్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని జగత్‌సింగ్‌పుర్‌ గ్రామం వద్ద బంధ్‌ బైపాస్‌ రోడ్డుపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఓ యువతి తనతో ఉన్న యువకుడితో కలిసి రోడ్డుపక్కన ఫొటోలు తీసుకుంటుండగా కొందరు యువకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమె వివరాలు అడుగుతూ దుర్భాషలాడినట్లు, అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను రోడ్డుపై లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బుధవారం రాత్రి నుంచి వీడియో సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అయింది. స్థానికంగా ఉన్న వ్యక్తి ఈ ఘటనను మొబైల్‌లో చిత్రీకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు వికాస్‌ శర్మ, రాహుల్‌ కుమార్‌ పేర్లను గుర్తించారు. వీరిద్దరూ జగత్‌సింగ్‌పుర్‌ గ్రామానికి చెందినవారే.

వికాస్‌ శర్మపై ఇప్పటికే మద్యం సంబంధిత పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వైరల్‌ వీడియో నిజమైనదేనా? దాన్ని ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారు? మొత్తం ఘటన ఇదేనా? లేక వీడియోను ఎడిట్‌ చేసి ప్రచారం చేశారా? అనే అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటనలో ఎంతమంది పాల్గొన్నారన్నది స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.
Advertisement

More Telugu News