లింక్డిన్‌లో ఉద్యోగం గురించి అబద్ధం చెబుతున్నారా? ఇక దొరికిపోవచ్చు!

లింక్డిన్‌లో ఉద్యోగం గురించి అబద్ధం చెబుతున్నారా? ఇక దొరికిపోవచ్చు!

LinkedIn users lying about jobs will now be caught
  • లింక్డిన్‌లో కొత్త వెరిఫికేషన్‌ ఫీచర్లు
  • ఫేక్‌ ఉద్యోగ క్లెయిమ్స్‌కు చెక్‌
  • తప్పుడు ఉద్యోగులను కంపెనీలు తొలగించే ఛాన్స్‌
  • అనుభవాన్ని సహోద్యోగులతో ధ్రువీకరించుకునే అవకాశం
  • ఆఫీస్‌ ఈమెయిల్‌తో వెరిఫికేషన్‌కు ఆప్షన్‌
  • ఫీచర్‌ త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి
లింక్డిన్‌లో తాము పని చేయని కంపెనీలో పనిచేస్తున్నట్లు ప్రొఫైల్‌లో పెట్టుకుంటున్నారా? ఇకపై అలాంటి ఫేక్‌ క్లెయిమ్స్‌కు చెక్‌ పడనుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లింక్డిన్‌ కొత్త వెరిఫికేషన్‌ ఫీచర్లను తీసుకొస్తోంది. ఫేక్‌ ఐడెంటిటీలు, తప్పుడు ఉద్యోగ వివరాలు, కంపెనీ పేరుతో మోసాలకు అడ్డుకట్ట వేయడమే వీటి లక్ష్యం.

కొత్త ఫీచర్లలో భాగంగా వెరిఫైడ్‌ కంపెనీలకు కీలక అధికారం ఇవ్వనున్నారు. తమ సంస్థలో పనిచేస్తున్నట్లు తప్పుడు క్లెయిమ్‌ చేస్తున్న అకౌంట్లను కంపెనీలు తొలగించవచ్చు. అలాంటి ప్రొఫైల్స్‌ తమ కంపెనీకి సంబంధించిన సెర్చ్‌ ఫలితాల్లో కనిపించకుండా, ఉద్యోగుల జాబితాలో చేరకుండా కూడా అడ్డుకోవచ్చు. ఈ ఫీచర్‌ను రాబోయే కొన్ని వారాల్లో ప్రపంచవ్యాప్తంగా వెరిఫైడ్‌ కంపెనీలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు లింక్డిన్‌ తెలిపింది.

ఉద్యోగ అనుభవాన్ని నిర్ధారించుకునేందుకు మరో కొత్త విధానాన్ని కూడా లింక్డిన్‌ పరీక్షిస్తోంది. గతంలో కలిసి పనిచేసిన లేదా చదువుకున్న వ్యక్తులు ఒకరి ప్రొఫైల్‌లో పేర్కొన్న అనుభవాన్ని ధ్రువీకరించే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ధ్రువీకరించే వ్యక్తికి ఇప్పటికే వెరిఫైడ్‌ ప్రొఫైల్‌ ఉండాలి. ఇది సాధారణ స్కిల్‌ ఎండార్స్‌మెంట్‌కు భిన్నంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

కొన్ని సంస్థల ఉద్యోగులకు ప్రస్తుతం మరో వెరిఫికేషన్‌ విధానాన్ని పరీక్షిస్తున్నారు. ప్రొఫైల్‌లో కంపెనీని ప్రస్తుత ఉద్యోగ సంస్థగా పేర్కొన్న వారు తమ ఆఫీస్‌ ఈమెయిల్‌ ద్వారా ఉద్యోగాన్ని నిర్ధారించుకోవాల్సి రావచ్చు. ఈమెయిల్‌కు వచ్చిన కోడ్‌ను నమోదు చేస్తే వెరిఫికేషన్‌ పూర్తవుతుంది.

ఏఐ సాయంతో నమ్మదగినట్లు కనిపించే నకిలీ ప్రొఫైల్స్‌ తయారు చేయడం సులభమవుతున్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా నకిలీ రిక్రూటర్లు, ఉద్యోగం పేరుతో జరిగే ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట వేయడంలో ఇవి ఉపయోగపడతాయని లింక్డిన్‌ భావిస్తోంది. అయితే ఫ్రీలాన్సర్లు, స్వయం ఉపాధి చేసుకునేవారికి కంపెనీ ఈమెయిల్‌ లేకపోవచ్చు కాబట్టి వారికి ఈ వెరిఫికేషన్‌ తప్పనిసరి కాదు.
Advertisement
LinkedIn
Job Verification
Fake Profiles
Microsoft
Online Recruitment Fraud
Professional Networking

More Telugu News