ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తాను రహస్యంగా సమావేశం అవుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని, అవి కేవలం కట్టుకథలని కొట్టిపారేశారు. 

తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని తెర వెనుక రాజకీయాలు చేసుకునే ఖర్మ వైఎస్సార్ బిడ్డగా తనకు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా తాను జగన్‌ను కలవబోతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు షర్మిల తెలిపారు. 

తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడే తాను చివరిసారిగా జగన్‌ను కలిశానని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ కలిస్తే, అది కేవలం తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ మహోత్సవానికి ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించినట్లే జగన్‌ను కూడా పిలుస్తానని, ఇందులో వింతేమీ లేదని అన్నారు.

"నేను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలు మాత్రమే. ఈ విశ్లేషణలు పూర్తిగా నిరాధారం. శుభకార్యానికి, రాజకీయానికి ముడిపెట్టి నా విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదు" అని షర్మిల హెచ్చరించారు.

వివాహ వేడుకల వివరాలు
ఈ సందర్భంగా షర్మిల తన కుమార్తె వివాహ వేడుకల వివరాలను అధికారికంగా ప్రకటించారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల నిశ్చితార్థం ఈ నెల 24న, వివాహం నవంబర్ 25న, రిసెప్షన్ డిసెంబర్ 5న జరుగుతాయని వెల్లడించారు. ఈ శుభవార్తను తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

కుటుంబ సభ్యులు, కాబోయే వియ్యంకుల సమక్షంలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి వివాహ పత్రికను ఉంచి, ఆయన ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. తన తండ్రి దీవెనలు బిడ్డల జీవితాలకు కొండంత అండ అని షర్మిల పేర్కొన్నారు. కాబోయే నవదంపతులను తెలుగు ప్రజలందరూ హృదయపూర్వకంగా ఆశీర్వదించాలని ఆమె కోరారు.