కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తప్పులు చేస్తే కేంద్ర హోంశాఖ చేతిలో ఉన్న అధికారాలతో వాటిని బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. జనాలను పోగేసి దమ్కీలు ఇస్తే భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ పేరు చెబితే బీజేపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలు కాంగ్రెస్‌కు అండగా ఉన్నందునే వారి ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను బీజేపీ ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని అడ్లూరి డిమాండ్‌ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలు కోరుతున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న ఉద్దేశమేంటని నిలదీశారు. రాజ్యాంగం ద్వారా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రజలకు కల్పించిన ఓటు హక్కును హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా వెనుక అదానీ, అంబానీ ఉన్నారని మంత్రి ఆరోపించారు. దేశ సంపదను ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తల చేతుల్లో పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఎన్నికల ప్రక్రియపై బీజేపీని లక్ష్యంగా చేసుకుని అడ్లూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.