కాంగ్రెస్ ఎంపీ శ్యామ్‌కుమార్ బర్వే.. తన సహచర మహిళా ఎంపీ ప్రతిభా ధనోర్కర్‌ను చెంపదెబ్బ కొడుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో దుమారం రేపుతోంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీకి బస్సులో వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే, శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.

అయితే, ఈ వివాదంపై ఎంపీ ప్రతిభా ధనోర్కర్ స్పందించారు. తన సోదరుడి లాంటి సహచర ఎంపీతో చాలా తేలికగా, సరదాగా జరిగిన సంభాషణను వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం వైరల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. "నా ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ప్రత్యర్థులు ఈ ఘటనను వాడుకుంటున్నారు. దివంగత మాజీ ఎంపీ బాలుభౌ ధనోర్కర్ వారసురాలిని, ఆడపులిని నేను. ఇలాంటి దుష్ప్రచారాలకు భయపడను, మరింత ధైర్యంగా నిలబడతాను" అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తీవ్రంగా స్పందించారు. ఒక మహిళపై చేయి చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. "కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవించాలి. కానీ వారి చర్యలు అలా కనిపించడం లేదు. మహిళపై చేయి ఎత్తడం తప్పు. ఆ ఎంపీ వెంటనే క్షమాపణ చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

శివసేన నేత సంజయ్ నిరుపమ్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ వీడియో చాలా అభ్యంతరకరంగా ఉందని, ఇది చూశాక కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. "ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటూ ర్యాలీకి వెళుతూ.. ఒక మహిళా ప్రజాప్రతినిధి గౌరవానికి భంగం కలిగించడం సిగ్గుచేటు" అని అన్నారు.

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన బర్వే, ధనోర్కర్ ఇద్దరూ కాంగ్రెస్ ఎంపీలు. తన భర్త, మాజీ ఎంపీ బాలుభౌ ధనోర్కర్ మరణం తర్వాత ప్రతిభ చంద్రపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో చుట్టూ రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.