ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఘోర ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి
- ఆసుపత్రిలో ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
- అత్యంత బాధాకరమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశం
ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ వార్డులో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారాన్ని వ్యక్తం చేశారు. ఏసీలో చోటుచేసుకున్న షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించి వార్డులో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం, బాధాకరమని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరణించిన చిన్నారుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఘటన తీవ్రత తెలిసిన వెంటనే ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి... ప్రమాదంలో గాయపడిన, దట్టమైన పొగవల్ల ఊపిరాడక అస్వస్థతకు గురైన మిగిలిన పసికందులకు అత్యున్నత స్థాయి అత్యవసర వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర సాంకేతిక విచారణ జరిపి తక్షణ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఇటువంటి అగ్నిప్రమాదాలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి భద్రతా చర్యలను తక్షణమే పటిష్టం చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.