రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్... శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్... శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

Minister Ponguleti lays foundation stone for Indiramma Towers in Rayadurgam
  • రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన
  • ప్రతి నియోజకవర్గంలో లక్ష ఇళ్లు నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి
  • గత ప్రభుత్వం పేదలను నిర్లక్ష్యం చేసిందని విమర్శ
  • ఎల్3 కేటగిరీ లబ్ధిదారుల విషయంలో స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
  • నెల రోజుల్లో అన్నిచోట్లా పనులు మొదలని ప్రకటన
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని రాయదుర్గంలో 'ఇందిరమ్మ టవర్స్' నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. మల్కంచెరువు వెనుక భాగంలో 2.85 ఎకరాల విస్తీర్ణంలో ఈ టవర్స్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు ఆయన ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందేవరకు ఈ పథకం దశలవారీగా నిరంతరాయంగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. క్యూర్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో లక్ష ఇళ్లను నిర్మించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదల సంక్షేమాన్ని విస్మరించి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. 

నగరానికి దూరంగా, నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తే, తమ ప్రభుత్వం అత్యంత విలువైన ప్రాంతాల్లోనే పేదలకు గృహవసతి కల్పిస్తోందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, కేవలం పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకుని ఇళ్లను కేటాయిస్తున్నామని తెలిపారు. రాబోయే నెల రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.

విచారణలో అనర్హులుగా తేలిన ఎల్3 కేటగిరీ లబ్ధిదారుల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన వారికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తామని, బేస్‌మెంట్ పూర్తి చేసిన ఇళ్లకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అయితే, ఇళ్లు మంజూరై ఉండి, ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని అనర్హుల కేటాయింపులను రద్దు చేస్తామని, ఆ స్థానంలో అర్హులైన ఇతరులకు అవకాశం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Advertisement
Ponguleti Srinivas Reddy
Indiramma Towers
Rayadurgam
Telangana Housing Scheme
Serilingampally

More Telugu News