కేసీఆర్ చారిత్రక నిర్లక్ష్యంతోనే నీటి ఎద్దడి: జూపల్లి కృష్ణారావు

కేసీఆర్ చారిత్రక నిర్లక్ష్యంతోనే నీటి ఎద్దడి: జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao blames KCR historical negligence for water scarcity
  • కేసీఆర్ హయాంలో ఆంధ్ర ప్రాజెక్టులకు మేలు చేశారన్న జూపల్లి
  • వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపాటు
  • జూరాల వద్ద రిజర్వాయర్ నిర్మించకపోవడం వల్ల 5.50 లక్షల ఎకరాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన

గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యం, నిర్లక్ష్యపూరిత విధానాల వల్లే నేడు రాష్ట్రంలో నీటి నిల్వలు తగ్గి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురించిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 


అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా సెంటర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన... కేసీఆర్ హయాంలో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేవలం 30 శాతానికే పరిమితం చేసి ఆంధ్రా ప్రాజెక్టులకు లబ్ధి చేకూర్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పోరాడి ఆ వాటాను 43 శాతానికి పెంచుకున్నామని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే పాలమూరు తీవ్రంగా నష్టపోయిందన్నారు.


రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్ పాలమూరు జిల్లాలో రిజర్వాయర్లను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. గట్టు వద్ద 20 టీఎంసీల రిజర్వాయర్ కడతానని చెప్పిన కేసీఆర్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. జూరాల వద్ద అదనపు రిజర్వాయర్ నిర్మించకపోవడం వల్లే ఈనాడు 5.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 


తమ ప్రభుత్వం ఈ నీటి ఎద్దడిని నివారించేందుకు 15 టీఎంసీల గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి జీవో జారీ చేయడమే కాకుండా, రికార్డు స్థాయిలో 19,543 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుంటూ సరఫరా వ్యవస్థను కాపాడుతోందని వెల్లడించారు. ఎల్ నినో కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల నిధులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో విఫలమైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు కేవలం శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement
Jupally Krishna Rao
K Chandrashekar Rao
Telangana water scarcity
BRS government neglect
Krishna River water share
Palamuru irrigation projects

More Telugu News