గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు.. మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు!

గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు.. మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు!

K Sobha Reddy alleges she was asked to visit guesthouse for business help
  • సీఎంకు సన్నిహితుడొకరు గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారన్న మహిళా వ్యాపారవేత్త
  • ఔట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన
  • తన చేదు అనుభవాన్ని వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన మిథునా యాడ్స్ అధినేత
  • సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేయడంతో వైరల్‌గా మారిన పోస్ట్
  • ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ప్రభుత్వ నిఘా వర్గాలు
తెలంగాణలో ఓ మహిళా వ్యాపారవేత్త సోషల్ మీడియా పోస్ట్ రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం రేపింది. తన వ్యాపార సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, సీఎంకు సన్నిహితుడిగా భావించిన వ్యక్తి ఒకరు తనను గెస్ట్‌హౌస్‌కు రావాలని కోరారంటూ మిథునా యాడ్స్‌ అధినేత కె.శోభారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ఆమె 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.

ఔట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో గత మూడేళ్లుగా తాను చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నానని శోభారెడ్డి తెలిపారు. రెగ్యులర్ టెండర్లు పిలిచే వరకు, రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో తాత్కాలికంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన కరవైందని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని సంస్థలపై నోటీసులు ఇచ్చినా నిర్మాణాలు కొనసాగుతున్నాయని, మరికొన్నింటికి జీవో నంబర్ 68 కింద మినహాయింపులు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో, సీఎంకు సన్నిహితుడని తాను భావించిన వ్యక్తిని సంప్రదించానని శోభారెడ్డి వివరించారు. అయితే, ఆ విషయం మాట్లాడటానికి గెస్ట్‌హౌస్‌కు రావాలని ఆయన కోరడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి పేరును బయటపెట్టడానికి ఇష్టపడటం లేదని, అయితే ఒక మహిళా వ్యాపారవేత్తగా తనకు ప్రత్యేక ప్రయోజనాలు అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం చట్టబద్ధమైన అవకాశం, సమానమైన ఆదరణ, గౌరవం మాత్రమే కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ పోస్టును సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఖాతాలకు ట్యాగ్ చేయడంతో ఇది వేగంగా వైరల్ అయింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ నిఘా వర్గాలు దృష్టి సారించి, ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Advertisement
K Sobha Reddy
Mithuna Ads
Telangana News
Women Entrepreneur Allegations
CM Revanth Reddy
Outdoor Advertising Business

More Telugu News