అమెరికా యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థుల దెబ్బ.. భారతీయులకు పెరిగిన వీసా టెన్షన్‌

అమెరికా యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థుల దెబ్బ.. భారతీయులకు పెరిగిన వీసా టెన్షన్‌

US Universities hit by drop in foreign student applications and Indian students face visa tension
  • సగానికి పైగా అమెరికా కాలేజీల్లో తగ్గిన విదేశీ విద్యార్థుల దరఖాస్తులు
  • వీసా జాప్యం, తిరస్కరణలే ప్రధాన కారణాలు
  • 63 శాతం యూనివర్సిటీ అధికారుల్లో ఇమ్మిగ్రేషన్‌పై ఆందోళన
  • విదేశీ విద్యార్థులు తగ్గడంతో 73 శాతం సంస్థల ఆదాయంతో తగ్గుదల
  • భారతీయ విద్యార్థులకు కీలకంగా మారిన వీసా పరిస్థితులు
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. 2026 విద్యా సంవత్సరానికి అమెరికాలోని సగానికి పైగా కాలేజీలు, యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులు తగ్గినట్లు తాజా సర్వే వెల్లడించింది. వీసాల జారీ ఆలస్యం, వీసా తిరస్కరణలు, కఠినమైన ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ పరిణామాలతో ముఖ్యంగా భారత్‌, చైనా నుంచి అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది.

అమెరికన్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ (ఏసీఈ) 328 మంది ఉన్నత విద్యా సంస్థల సీనియర్‌ అధికారులతో ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 63 శాతం మంది ఇమ్మిగ్రేషన్‌ ఆంక్షలు, వీసాల రద్దుపై తీవ్రంగా లేదా కొంతమేర ఆందోళన ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు.. 36 శాతం మంది ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ యూనివర్సిటీలు సిద్ధంగా లేవని తెలిపారు.

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం అమెరికా యూనివర్సిటీల అడ్మిషన్లపైనే కాదు.. వాటి ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం చూపుతుంది. విదేశీ విద్యార్థులను చేర్చుకునే యూనివర్సిటీల అధ్యక్షుల్లో 73 శాతం మంది.. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో తమ ఆదాయం కూడా తగ్గిందని తెలిపారు.

దీని ప్రభావం ఇప్పటికే కొన్ని క్యాంపస్‌లలో కనిపిస్తోంది. 23 శాతం మంది అధికారులు పరిశోధనలు, విద్యార్థుల సహాయ కార్యక్రమాలకు కేటాయించే బడ్జెట్‌ను తగ్గించినట్లు చెప్పారు. 9 శాతం మంది కొన్ని కోర్సులను మూసివేయడం లేదా ఇతర కోర్సులతో విలీనం చేయాల్సి వచ్చిందన్నారు. మరో 11 శాతం మంది విద్యార్థులకు ఇచ్చే ఆర్థిక సాయం తగ్గినట్లు వెల్లడించారు.

అమెరికా యూనివర్సిటీలో సీటు రావడం ఒక్కటే ఇప్పుడు సరిపోదు. అడ్మిషన్‌ వచ్చిన తర్వాత వీసా ఎప్పుడు వస్తుంది? ఇమ్మిగ్రేషన్‌ నిబంధనల్లో ఏమైనా మార్పులు వస్తాయా? అనే అంశాలు కూడా విద్యార్థులకు కీలకంగా మారాయి.

వీసా ప్రక్రియ ఆలస్యమైతే, నిర్ణయించిన సమయానికి విద్యార్థులు అమెరికా వెళ్లి తరగతులకు హాజరుకావడం కష్టమవుతుంది. అదే సమయంలో వీసాలపై అనిశ్చితి కొనసాగితే యూనివర్సిటీలు కూడా విదేశీ విద్యార్థుల సంఖ్యను అంచనా వేయడం కష్టమవుతుంది.

ఇప్పటికే అమెరికా యూనివర్సిటీల్లో దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం ప్రధాన ఆందోళనగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థుల దరఖాస్తులు, అడ్మిషన్లు తగ్గడం అక్కడి విద్యా సంస్థలకు మరో సవాలుగా మారుతోంది.
Advertisement
US Universities
Foreign Student Applications
Indian Student Visa Tension
US Student Visa Delays
Immigration Policy Impact
ACE Survey Report

More Telugu News