తుని సమీపంలో రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సును ఢీకొట్టిన లారీ

తుని సమీపంలో రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సును ఢీకొట్టిన లారీ

Tuni Road Accident Lorry Hits Wedding Bus
  • తుని సమీపంలో పెళ్లి బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ
  • ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు
  • వివాహ వేడుక ముగించుకుని ఉప్పాడకు వెళ్తుండగా ఘటన
  • ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు
కాకినాడ జిల్లా తుని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

తునిలోని సాయి వేదికలో నిర్వహించిన వివాహ వేడుక ముగించుకుని, వధువు బంధువులు బస్సులో ఉప్పాడకు తిరుగు ప్రయాణమయ్యారు. తుని మండలం తేటగుంట, రాజులకొత్తూరు గ్రామాల మధ్య జాతీయ రహదారిపైకి రాగానే, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కంటైనర్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలను పగలగొట్టుకుని బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్సుల ద్వారా తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అధికారులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Tuni Road Accident
Kakinada District
Wedding Bus Accident
Andhra Pradesh News
Container Lorry Collision

More Telugu News