చైనా నుంచి బయటకు వెళ్లడం ఇక అంత ఈజీ కాదు.. కొత్త రూల్స్‌తో షాక్‌!

చైనా నుంచి బయటకు వెళ్లడం ఇక అంత ఈజీ కాదు.. కొత్త రూల్స్‌తో షాక్‌!

China new exit rules make leaving the country difficult
  • చైనాలో కొత్త నిష్క్రమణ ఆంక్షలు అమల్లోకి
  • పౌరులు, విదేశీయుల ప్రయాణంపై అధికారులకు విస్తృత అధికారాలు
  • జాతీయ భద్రత పేరుతో ఆంక్షలు విధించే అవకాశం
  • నిబంధనలపై హెచ్‌ఆర్‌డబ్ల్యూ తీవ్ర ఆందోళన
  • విదేశీయులపైనా గతంలో ఆంక్షలు విధించిన ఉదాహరణలు
చైనా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశ పౌరులతో పాటు విదేశీయులు చైనా నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకునే అధికారం అధికారులకు ఈ నిబంధనలు కల్పిస్తున్నాయని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ (హెచ్‌ఆర్‌డబ్ల్యూ) తెలిపింది. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా గుర్తించిన దేశాన్ని విడిచి వెళ్లే హక్కుకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.

సెప్టెంబరు 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. జాతీయ భద్రత, ప్రమాదాల పేరుతో, స్పష్టత లేని కారణాలతో ప్రయాణాన్ని అడ్డుకునే అవకాశం అధికారులకు కల్పించారని హెచ్‌ఆర్‌డబ్ల్యూ ఆరోపించింది. దేశం విడిచి వెళ్లడంపై ఆంక్షలు విధించాలంటే అవి అవసరమైనవి, సముచితమైనవిగా ఉండాలని అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు చెబుతున్నాయని సంస్థ పేర్కొంది.

హెచ్‌ఆర్‌డబ్ల్యూ ఆసియా విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ మాయా వాంగ్‌ ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరిని దేశం నుంచి బయటకు వెళ్లనివ్వాలి? ఎవరిని అడ్డుకోవాలి? అన్నది అధికారులు తమ ఇష్టానుసారం నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతోందని ఆమె అన్నారు. మానవ హక్కుల కార్యకర్తలు, కొన్ని మైనారిటీ వర్గాల అంతర్జాతీయ ప్రయాణాలపై ఇప్పటికే చైనా అధికారులు నిఘా, ఆంక్షలు పెంచారని తెలిపారు.

విదేశీయులపైనా ఇదే పరిస్థితి ఉండొచ్చని హెచ్‌ఆర్‌డబ్ల్యూ హెచ్చరించింది. 2025 జులైలో ఓ అమెరికా ప్రభుత్వ ఉద్యోగి, వెల్స్‌ ఫార్గో బ్యాంక్‌ అధికారి చైనా నుంచి బయటకు వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారని పేర్కొంది. వారిపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు నమోదు కాలేదని తెలిపింది.

చైనా గత దశాబ్దంలో దేశం విడిచి వెళ్లే విషయంలో ఆంక్షలను క్రమంగా పెంచిందని హెచ్‌ఆర్‌డబ్ల్యూ పేర్కొంది. ముఖ్యంగా మతపరమైన మైనారిటీలు, మానవ హక్కుల కార్యకర్తలపై ప్రయాణ పరిమితులు పెరిగాయని తెలిపింది. 2016లో జిన్‌జియాంగ్‌ అధికారులు గతంలో జారీ చేసిన పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్న తర్వాత మైనారిటీ ఉయ్ గర్ ముస్లింల విదేశీ ప్రయాణంపై ఆంక్షలు మరింత తీవ్రమయ్యాయని చెప్పింది.

కొత్త నిబంధనలు భావ వ్యక్తీకరణ, విద్యా స్వేచ్ఛపై కూడా ప్రభావం చూపొచ్చని హెచ్‌ఆర్‌డబ్ల్యూ ఆందోళన వ్యక్తం చేసింది. దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకుంటారనే భయంతో చైనా పౌరులు, విదేశీయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో వెనుకడుగు వేసే అవకాశం ఉందని పేర్కొంది.
Advertisement
China
Exit Ban Rules
Human Rights Watch
Maya Wang
National Security Laws
Travel Restrictions

More Telugu News