కేటీఆర్ సిబ్బంది విచారణ: సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

కేటీఆర్ సిబ్బంది విచారణ: సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం

KTR staff interrogation Preserve CCTV footage High Court orders police
  • పోలీస్ స్టేషన్‌లో తమపై దాడికి యత్నించారని కేటీఆర్ సిబ్బంది ఆరోపణ
  • తదుపరి విచారణకు హాజరైనప్పుడు వారికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశం
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్వోల విచారణకు సంబంధించిన కీలకమైన సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని సైఫాబాద్ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 14న వారు పోలీస్ స్టేషన్‌కు వచ్చి వెళ్లిన సమయానికి సంబంధించిన ఫుటేజీని భద్రంగా ఉంచాలని జస్టిస్ టి. మాధవి దేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న గందరగోళానికి సంబంధించి, సెప్టెంబర్ 14న కేటీఆర్ పర్సనల్ అసిస్టెంట్ కుంభా మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్ మాణిక్యలను పోలీసులు విచారణకు పిలిచారు. అయితే, పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుగుతున్న సమయంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు తమపై ఆయుధాలతో దాడికి యత్నించారని, ఆ సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపిస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు.

తమను మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి ఉండేలా చేశారని, ఆ తర్వాత కొందరు వ్యక్తులు గుంపుగా విచారణ గదిలోకి ప్రవేశించి దుర్భాషలాడారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాడి యత్నంపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు నిరాకరించారని కూడా ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ ఆరోపణలను హోం శాఖ ప్రభుత్వ న్యాయవాది తోసిపుచ్చారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన స్పష్టం చేశారు. ఓ కార్యక్రమానికి డీజే అనుమతి కోసం కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఇప్పటికే ఫిర్యాదు నమోదైందని కోర్టుకు వివరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, పిటిషనర్లు తదుపరి విచారణకు హాజరైనప్పుడు వారికి తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హోం సెక్రటరీ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఖైరతాబాద్‌ ఏసీపీలకు నోటీసులు జారీ చేసింది.
Advertisement
KTR
Telangana High Court
Saifabad Police Station
CCTV Footage
Mahender Reddy
BRS Party

More Telugu News