పదే పదే ప్రెస్‌మీట్లు పెట్టి నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారు: జగన్ పై అనిత ఫైర్
- డీఎస్సీ నియామకాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అనిత మండిపాటు
- డీఎస్సీ పూర్తయిన ఏడాది తర్వాత బురద చల్లుతున్నారని ఆగ్రహం
- వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసని వ్యాఖ్య
ఏపీలో డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయి ఏడాది గడిచిన తర్వాత, కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైసీపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అనిత మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ పదే పదే ప్రెస్‌మీట్లు పెట్టి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని, అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలుసని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే వీరికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
మరోవైపు, ఏపీపీఎస్సీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైసీపీ ఈ రాద్ధాంతం చేస్తోందని అప్పసాని రాజేశ్ ఆరోపించారు. డీఎస్సీ నియామకాలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు వేసిన 320 కేసులను న్యాయస్థానం కొట్టివేసిందని గుర్తు చేశారు. గత ఐదేళ్ల పాలనలో ‘జాబ్‌లెస్ క్యాలెండర్’తో యువతను మోసం చేసిన జగన్, ఇప్పుడు అత్యంత పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.