నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
- దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జేసన్
- సందీప్ కిషన్ హీరోగా 'సిగ్మా' చిత్రం
- తన సినిమా కోసం తన తండ్రి ఎదురు చూస్తున్నారని వెల్లడి
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వారసుడు జేసన్ సంజయ్ సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘సిగ్మా’ ద్వారా అతడు మెగాఫోన్ పట్టాడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక మీడియా సమావేశం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ... విదేశాల్లో స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్ కోర్సులు పూర్తి చేసి సినిమా నిర్మాణంలోని 24 క్రాఫ్ట్స్‌పై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నట్లు వెల్లడించాడు. తన సినీ ప్రయాణంలో తండ్రి విజయ్ ప్రోత్సాహం మరువలేనిదని, ‘మైఖేల్’ సినిమాలో సందీప్ కిషన్ అభినయం బాగా నచ్చడంతోనే ఈ కథకు ఆయనను ఎంపిక చేసుకున్నానని చెప్పాడు. ఈ తొలి చిత్రాన్ని వెండితెరపై వీక్షించేందుకు తన తండ్రి ఎంతో ఆత్రుతగా నిరీక్షిస్తున్నారని జేసన్ హర్షం వ్యక్తం చేశాడు.
ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన కథానాయికగా నటిస్తున్న ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, ‘సిగ్మా’ తన మొదటి తమిళ ప్రాజెక్ట్ అయినప్పటికీ పాత్ర ప్రాధాన్యత రీత్యా తన సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ వైవిధ్యమైన చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని హీరో సందీప్ కిషన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.