రాష్ట్రంలో తీవ్ర కరవుపై ముందస్తు చర్యలు శూన్యం: కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజం
- రాష్ట్రంలో కరవు పరిస్థితులపై జగన్ ఆందోళన
- ఈ ఖరీఫ్‌లో సాగు 56.4 లక్షల ఎకరాలకే పరిమితమయిందన్న జగన్
- రైతులను నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమవుతున్న కరవు, వర్షాభావ పరిస్థితులపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లాల వారీగా పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఖరీఫ్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో 51 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైందని, మొత్తం 688 మండలాల్లో 628 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందే తెలిసినా కూటమి ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
ఖరీఫ్‌లో సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా కేవలం 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరాకు రూ.15,000, పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.25,000 చొప్పున ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి పాత బకాయిలైన రూ.3,000 కోట్లను విడుదల చేయాలన్నారు. ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద పెండింగ్‌లో ఉన్న రూ.41,000 చెల్లించాలని సూచించారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.6,000 కోట్లు అందించాలన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని తరలించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు.
సాగునీటి రంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తప్పుబడుతూ, పోలవరం నిల్వ సామర్థ్యంపై రాజీపడుతూ ఉనికి కోసం లిఫ్ట్ ప్రాజెక్టులతో డ్రామాలు ఆడుతున్నారని జగన్ విమర్శించారు. కరవు బారిన పడిన గ్రామీణ ప్రాంత ప్రజల కోసం అదనంగా 150 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలని, తాగునీటి ఎద్దడి నివారణకు ఉచిత ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ క్షేత్రస్థాయి కార్యాచరణ చేపడుతుందని, త్వరలోనే తాను స్వయంగా కరవు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు.