ఏపీ మద్యం రవాణా కుంభకోణం.. మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ పొడిగింపు
- కారుమూరిని విజయవాడ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చిన ఈడీ అధికారులు
- హవాలా మార్గంలో రూ. 15 కోట్లు కారుమూరికి చేరినట్లు ఆధారాలు
- ఇప్పటివరకు ఆయన కుటుంబానికి చెందిన రూ. 87.7 కోట్ల ఆస్తుల జప్తు
మద్యం రవాణా స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను... ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పీటీ వారెంట్‌పై విజయవాడ ప్రత్యేక కోర్టుకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం ఆయన రిమాండ్ ను న్యాయస్థానం సెప్టెంబరు 25 వరకు పొడిగించింది.
ఈ కేసు విషయానికొస్తే... (ఈడీ నివేదిక ప్రకారం) సాధారణ నిబంధనల మేరకు కిలోమీటర్‌కు రూ. 13 మాత్రమే రవాణా ఛార్జీలుగా చెల్లించాల్సి ఉండగా, టెండర్ల నిబంధనలను అక్రమంగా సవరించి కిలోమీటర్‌కు ఏకంగా రూ. 35 వరకు చెల్లించారు. ఈ అక్రమ మార్పుల కారణంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 195.33 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థ ప్రాథమికంగా లెక్కగట్టింది.
కారుమూరి నాగేశ్వరరావు పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ తన కుమారుడు, వ్యాపార భాగస్వాములకు మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టులు దక్కేలా చక్రం తిప్పారని దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంలో హవాలా మార్గంలో దాదాపు రూ. 15 కోట్లు కారుమూరికి చేరినట్లు ఆధారాలు సేకరించిన అధికారులు, ఇప్పటివరకు ఆయన కుటుంబానికి చెందిన రూ. 87.7 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ కుమార్, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, డిజిటల్ నెట్‌వర్క్స్ అధినేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలను ఈడీ అరెస్ట్ చేసి విచారిస్తోంది.