ఉల్లి ఘాటు, చికెన్ జోరు.. మళ్లీ పెరిగిన ఇంటి భోజనం ఖర్చు

ఉల్లి ఘాటు, చికెన్ జోరు.. మళ్లీ పెరిగిన ఇంటి భోజనం ఖర్చు

Onion heat chicken surge home meal costs increase again
  • ఆగస్టులో స్వల్పంగా పెరిగిన ఇంటి భోజనం ఖర్చు
  • గతేడాదితో పోలిస్తే 5 శాతం పెరిగిన నాన్-వెజ్ థాలీ ధర
  • ఉల్లి ధరలు 43 శాతం పెరగడమే ప్రధాన కారణమని వెల్లడి
  • టమాటా, బంగాళాదుంప ధరలు తగ్గడంతో కొంత ఊరట
  • రానున్న 2-3 నెలలు ఉల్లి ధరలు అధికంగానే ఉంటాయని అంచనా
సామాన్యుడి వంటింటి బడ్జెట్‌పై ధరల భారం మరోసారి పెరిగింది. ఆగస్టు నెలలో గృహావసర భోజనం ఖర్చులు స్వల్పంగా పెరిగినట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ 'క్రిసిల్' తన తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ఉల్లిపాయలు, వంట నూనెలు, బ్రాయిలర్ చికెన్ ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.

క్రిసిల్ 'రోటీ రైస్ రేట్' నివేదిక ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే శాకాహార భోజనం (వెజ్ థాలీ) ధర 1 శాతం పెరిగి రూ. 29.5కి చేరింది. అదే సమయంలో, మాంసాహార భోజనం (నాన్-వెజ్ థాలీ) ధర 5 శాతం పెరిగి రూ. 57.5కు చేరింది. అయితే, జూలై నెలతో పోల్చితే నాన్-వెజ్ థాలీ ధర 1 శాతం తగ్గడం గమనార్హం.

ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా ఉల్లి ధరలు ఏకంగా 43 శాతం మేర పెరగడమే ముఖ్య కారణం. మార్చి-ఏప్రిల్ నెలల్లో మహారాష్ట్రలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్లు వానల ప్రభావంతో సరఫరా తగ్గి ఉల్లి ధర కిలోకు రూ. 40కి చేరింది. వీటికి తోడు వంట నూనెల ధరలు 11 శాతం, ఎల్‌పీజీ ధరలు 10 శాతం, బ్రాయిలర్ చికెన్ ధరలు 10 శాతం మేర పెరిగాయి. నాన్-వెజ్ థాలీ ప్రియం కావడంలో చికెన్ ధరల పెరుగుదల కీలక పాత్ర పోషించింది.

మరోవైపు బంగాళాదుంపల ధరలు 12 శాతం, టమాటా ధరలు 28 శాతం మేర తగ్గడంతో వెజ్ థాలీ ధరలు మరింత పెరగకుండా కొంతమేర అదుపులో ఉన్నాయి. ఇక జూలై నెలతో పోలిస్తే, శ్రావణ మాసం కారణంగా చికెన్ వినియోగం తగ్గి బ్రాయిలర్ ధరలు 4 శాతం మేర క్షీణించాయి. దీంతో నాన్-వెజ్ థాలీ ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. అయితే, రబీ పంట సరఫరా తగ్గడం, ఖరీఫ్ పంట రాక ఆలస్యం కావడం వల్ల రాబోయే రెండు మూడు నెలల పాటు ఉల్లి ధరలు అధికంగానే ఉండే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పుషన్ శర్మ అంచనా వేశారు.
Advertisement
CRISIL
Food price hike
Onion prices
Veg thali cost
Non veg thali price
Broiler chicken rates

More Telugu News