హిందీ మన జాతీయ భాష అన్న శివరాజ్‌కుమార్ పై కన్నడిగుల ఆగ్రహం
- ‘ఒరిజినల్ మాన్‌స్టర్’ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్న శివరాజ్‌కుమార్
- హిందీ జాతీయ భాష కాదంటున్న కన్నడ సంఘాలు
- శివరాజ్‌కుమార్ కు మద్దతుగా నిలిచిన ఆయన అభిమానులు
తన పాన్-ఇండియా చిత్రం ‘ఒరిజినల్ మాన్‌స్టర్’ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల్లో అసంతృప్తికి దారితీశాయి. హిందీలో డైలాగులు చెప్పడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... హిందీ చాలా సులువైన భాష అని, అది మన రెండో భాషతో పాటు ‘జాతీయ భాష’ అని, తనకు హిందీ బాగా వచ్చని పేర్కొన్నారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో కన్నడిగులు, కన్నడ సంస్కృతీ పరిరక్షకులు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశానికి ఎలాంటి అధికారిక ‘జాతీయ భాష’ లేదని, అన్ని ప్రాంతీయ భాషలకు సమాన ప్రాధాన్యం ఉందనే స్పృహ లేకుండా కన్నడ నాట దిగ్గజ కుటుంబానికి చెందిన హీరో ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. దివంగత లెజెండరీ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కన్నడ భాషా ఉద్యమాల్లో నిర్వహించిన పాత్రను గుర్తుచేస్తూ, శివరాజ్‌కుమార్ మాటలు వింటే ఆయన ఆత్మ నిరాశ చెందుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న భాష అనే భావనతోనే శివరాజ్‌కుమార్ ఆ మాటలు అన్నారని, కన్నడ భాషను కించపరచాలనే ఉద్దేశం ఆయనకు లేదని అభిమానులు సమర్థిస్తున్నారు.
ఆర్. చంద్రు దర్శకత్వంలో 1990-2000 కాలం నాటి యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఒరిజినల్ మాన్‌స్టర్’ సినిమాతో శివరాజ్‌కుమార్ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్న వేళ ఈ వివాదం రాజుకోవడం గమనార్హం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.