నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి: మార్గాని భరత్

నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలి: మార్గాని భరత్

Nara Lokesh must resign immediately says Margani Bharat
  • డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్న మార్గాని భరత్
  • సూత్రధారులను వెలికి తీసేందుకు సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్
  • లోకేశ్ ఎమ్మెల్యే కాకముందే తాను ఎంపీగా గెలిచానని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. విజిలెన్స్ విచారణ జరుగుతోందని అధికారులు చెప్పారని... దీని అర్థం డీఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పడమే అని అన్నారు. విజిలెన్స్ పేరుతో కాలయాపన చేయకుండా ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీసేందుకు సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


స్పోర్ట్స్ కోటా కింద కేటాయించిన 382 ఉద్యోగాలను ఎవరికి ఇచ్చారో పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని మార్గాని భరత్ నిలదీశారు. జూడో అసోసియేషన్ ఛైర్మన్‌గా ఉన్న లోకేశ్ తోడల్లుడు శ్రీభరత్ పైనా ఆరోపణలు చేస్తూ... పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ అక్రమాలు జరిగాయని విమర్శించారు. అసెంబ్లీని, ప్రజలను పచ్చి అబద్ధాలతో తప్పుదోవ పట్టించిన లోకేశ్ కి జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. "లోకేశ్ ఎమ్మెల్యే కాకముందే నేను ఎంపీగా గెలిచాను. డీఎస్సీ అక్రమాలపై లోకేశ్ తో ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం. కరకట్ట నివాసమైనా, హైదరాబాద్ ఇల్లయినా తేదీ, సమయం ఆయనే ప్రకటించాలి" అని బహిరంగ సవాల్ విసిరారు.

Advertisement
Margani Bharat
Nara Lokesh
AP DSC Scam
Andhra Pradesh Education Minister
Sri Bharat
YSRCP

More Telugu News