భారత్‌లో ఈవీల జోరు.. ఆగస్టులో ఆల్ టైమ్ రికార్డు అమ్మకాలు

భారత్‌లో ఈవీల జోరు.. ఆగస్టులో ఆల్ టైమ్ రికార్డు అమ్మకాలు

EV surge in India All time record sales in August
  • ఆగస్టులో రికార్డు స్థాయిలో 2.98 లక్షల ఈవీల అమ్మకాలు
  • గతేడాదితో పోలిస్తే 53 శాతం పెరిగిన విక్రయాలు
  • అన్ని విభాగాల్లోనూ ఆల్-టైమ్ ఆగస్టు రికార్డు నమోదు
  • ద్విచక్ర వాహనాల్లో టీవీఎస్, కార్లలో టాటా మోటార్స్ అగ్రస్థానం
  • సబ్సిడీలపై ఆధారపడకుండానే పెరుగుతున్న ఈవీ అమ్మకాలు
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. 2026 ఆగస్టు నెలలో ఈవీ అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 52.9 శాతం వృద్ధితో మొత్తం 2,98,448 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. దీంతో మొత్తం ఆటోమొబైల్ మార్కెట్‌లో ఈవీల వాటా 9.5 శాతం నుంచి 12.3 శాతానికి పెరిగింది. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) మంగళవారం గణాంకాలను విడుదల చేసింది.

ఫాడా నివేదిక ప్రకారం, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాలు.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఆగస్టు నెలలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదవడం విశేషం.

విభాగాల వారీగా అమ్మకాలు ఇలా..

ఎప్పటిలాగే, ఈవీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 67.05 శాతం వృద్ధితో 1,83,204 యూనిట్లకు చేరాయి. ఈ విభాగంలో టీవీఎస్ మోటార్ 48,938 యూనిట్లతో అగ్రస్థానంలో నిలవగా, బజాజ్ ఆటో (41,114), ఏథర్ ఎనర్జీ (28,757) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ప్రముఖ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 29 శాతం తగ్గి 13,852 యూనిట్లకు పరిమితమయ్యాయి.

ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల విక్రయాలు 25.28 శాతం పెరిగి 79,846 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ విభాగంలో బజాజ్ ఆటో (13,833) మొదటి స్థానంలో, మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ (12,806) రెండో స్థానంలో నిలిచాయి. ఇక ప్యాసింజర్ వాహనాల (కార్లు) అమ్మకాలు 51.89% వృద్ధితో 30,696 యూనిట్లకు పెరిగాయి. ఈ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ (13,158), మహీంద్రా అండ్ మహీంద్రా (6,464), జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (4,622) టాప్-3లో ఉన్నాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన విన్‌ఫాస్ట్ 2,199, టెస్లా 116 కార్లను విక్రయించాయి.

అన్నింటికంటే వేగంగా వృద్ధి చెందిన విభాగం ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలే. గతేడాది ఆగస్టులో కేవలం 1,631 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగి 4,702 యూనిట్లకు చేరాయి.

సబ్సిడీలపై ఆధారపడటం లేదు..

ఈ గణాంకాలపై ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్ మాట్లాడుతూ.. "భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీకి ఆగస్టు నెల చరిత్రాత్మకం. ముఖ్యంగా వాణిజ్య వాహనాల విభాగం పనితీరు అద్భుతం. అవి పైలట్ ప్రాజెక్టుల దశ నుంచి నేరుగా కొనుగోలు ఆర్డర్ల స్థాయికి చేరాయి. ఇప్పుడు ఈవీల అమ్మకాలు కేవలం సబ్సిడీల మీద ఆధారపడి లేవు. నిర్వహణ వ్యయం తగ్గడం, ఛార్జింగ్ సౌకర్యాలు విస్తరించడం, వినియోగదారుల్లో నమ్మకం పెరగడం వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పీఎం ఈ-డ్రైవ్, రాష్ట్రాల విధానాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి" అని వివరించారు.
Advertisement
Electric Vehicles
FADA India
India EV Sales Record
Tata Motors
TVS Motor
Electric Vehicle Market Growth

More Telugu News